ప్రపంచ కప్‌లో భారతీయం!
ABN , Publish Date - Jun 04 , 2026 | 02:11 AM
ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్‌కు వేళైంది. ప్రపంచ ప్రఖ్యాత సాకర్ స్టార్ల విన్యాసాలను తిలకించేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 39 రోజులపాటు ఇదో...
ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్‌కు వేళైంది. ప్రపంచ ప్రఖ్యాత సాకర్ స్టార్ల విన్యాసాలను తిలకించేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 39 రోజులపాటు ఇదో ప్రపంచ వ్యాప్త పండుగ. ఇంతటి మెగా టోర్నీలో పాల్గొనడమనేది ఫుట్‌బాల్ ఆడే ప్రతి జట్టు చిరకాల స్వప్నం. ఈ కోణంలో చూస్తే భారత సాకర్ అభిమానులకు నిరాశే. ప్రపంచ కప్‌నకు క్వాలిఫై అవడం టీమిండియాకు కలగానే మిగిలింది. అయితే వరల్డ్ కప్‌లో భారత్ తలపడకపోయినా..భారత సంతతి ఫుట్‌బాలర్ల ప్రదర్శన చూసి మురవాల్సిందే. ఈసారి టోర్నీలో వివిధ జట్ల తరపున నలుగురు భారత సంతతి ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. వారెవరో ఓ లుక్కేద్దాం..!
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
సర్‌ప్రీత్ సింగ్, శామ్యూల్ ముత్తుసామి, నిషాన్ వేలుపిళ్లై, తహ్‌సీన్ మొహ్మద్..ఈ దఫా ప్రపంచ కప్‌లో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లకు ఓ సామీప్యం ఉంది. 2006 వరల్డ్ కప్‌లో ఆడిన జర్మనీ జట్టు మిడ్‌ఫీల్డర్ వికాస్ దొరసు ఈ నలుగురు ఫుట్‌బాలర్లకు ఆరాథ్య ఆటగాడు కావడం. దొరసు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వాసులు కావడం విశేషం.
సర్‌ప్రీత్ సింగ్
(న్యూజిలాండ్)
సర్‌ప్రీత్ పంజాబ్ దంపతులకు ఆక్లాండ్‌లో జన్మించాడు. 2018లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన 27 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ సర్‌ప్రీత్ అదే ఏడాది ముంబైలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2-1తో గెలుపొందగా, ఆ రెండు గోల్స్ చేయడంలో సర్‌ప్రీత్ పాత్ర ఉంది. 2019లో బాయెర్న్ మ్యూనిచ్ తరపున జర్మన్ ఫస్ట్ డివిజన్ లీగ్‌లో ఆడాడు. 2019-20 సీజన్‌లో బండిస్లిగా టైటిల్ కైవసం చేసుకున్న బాయెర్న్ మ్యూనిచ్ జట్టులో సర్‌ప్రీత్ సభ్యుడు. సర్‌ప్రీత్ 2017, 2019 ఫిఫా అండర్-20 వరల్డ్ కప్‌లలో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
తహ్‌సీన్ మొహ్మద్ (ఖతార్)
కేరళం నుంచి ఖతార్‌కు వలస వచ్చిన దంపతులకు తహ్‌సీన్ జన్మించాడు. మొహ్మద్..తండ్రి జంషిడ్ మార్గదర్శనంలో సాకర్‌లో అడుగుపెట్టాడు. జంషిడ్ కాలికట్ యూనివర్సిటీ తరపున ఫుట్‌బాల్ ఆడాడు. దోహాలోని అస్పైర్ ఫుట్‌బాల్ అకాడమీలో తన ఆటకు మెరుగులుదిద్దుకున్న వింగర్ తహ్‌సీన్ 2024లో అఫ్ఘానిస్థాన్‌పై ఖతార్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
నిషాన్ వేలుపిళ్లై (ఆస్ట్రేలియా)
నిషాన్ మెల్‌బోర్న్‌లో జన్మించాడు. అతడి తల్లి ఆంగ్లో ఇండియన్, తండ్రి శ్రీలంక తమిళ సంతతికి చెందిన మలేసియన్. 2024లో ఆస్ట్రేలియా జట్టుకు నిషాన్ అరంగేట్రం చేశాడు. ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌ల్లో 25 ఏళ్ల వింగర్ నిషాన్ నాలుగు గోల్స్ సాధించాడు.
శామ్యూల్ ముత్తుసామి (డీఆర్ కాంగో)
ముత్తుసామి ఫ్రాన్స్‌లో జన్మించాడు. అతడి తల్లిది కాంగో కాగా, తండ్రి తమిళ సంతతికి చెందిన వ్యక్తి. ఫిఫా నిబంధనల ప్రకారం..ఆటగాడి తల్లి లేదా తండ్రి, బామ్మ, తాత ఆ దేశ భూభాగంలో జన్మించి ఉంటే, ఆ ఆటగాడు ఆ దేశ జాతీయ జట్టుకు ఆడేందుకు అర్హుడవుతాడు. 29 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ ముత్తుసామి 2019లో డీఆర్ కాంగో జాతీయ జట్టుకు ఎంపికై ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడాడు.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..