Share News

బుమ్రా వైఫల్యంపై స్పందించిన ముంబై ఇండియన్స్ కోచ్

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:44 PM

టీమిండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026లో తడబడుతున్నాడు. బుమ్రా బౌలింగ్‌ వైఫల్యంపై ముంబై జట్టు కోచ్‌ కీరన్ పొలార్డ్ స్పందించాడు.

 బుమ్రా వైఫల్యంపై స్పందించిన ముంబై ఇండియన్స్ కోచ్
Jasprit Bumrah struggles

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026లో తడబడుతున్నాడు. వికెట్లు తీసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడిన అతడు కేవలం రెండే వికెట్లు తీశాడు. ఇలా వికెట్లు తీయలేకపోవడంతోపాటు భారీగా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. సాధారణంగా బుమ్రా పిచ్‌తో సంబంధం లేకుండా పరుగులను నియంత్రించడం లేదా కీలక సమయంలో వికెట్లు తీయడం చేసేవాడు. కానీ, ఈ సీజన్‌లో అలా జరగడం లేదు. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా బౌలింగ్‌ వైఫల్యంపై తాజాగా ముంబై జట్టు కోచ్‌ కీరన్ పొలార్డ్ స్పందించాడు. తమ జట్టు అతడికి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశాడు.


పొలార్డ్ మీడియాతో మాట్లాడుతూ..'ఎవరైనా ప్లేయర్ సరైన ప్రదర్శన చేయలేకపోతే, వెంటనే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తుంటాం. అతడు ఎందుకు ఆడలేకపోతున్నాడనే దానిపై చర్చలు పెడుతుంటాం. ఇలాంటి వాటి నుంచి జస్ప్రీత్ బుమ్రా మినహాయింపేమీ కాదు. కొన్నేళ్లుగా అతడు ఎలాంటి ప్రదర్శన ఇచ్చాడో మనం చూశాం. అతడు కూడా మనిషే కదా.. బుమ్రా కూడా తప్పులు చేసే అవకాశం ఉంది. కాలం కలిసి రానప్పుడు గతంలో చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయినా, ఇప్పటికీ అతడు ప్రపంచంలోనే నంబర్‌వన్ బౌలర్, అలానే మా జట్టుకు కీలక బౌలర్’ అని పొలార్డ్ స్పష్టం చేశాడు.


అలానే జట్టు ప్రదర్శనపై కూడా పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్‌లో మా జట్టు నిలకడగా ఆడలేకపోతుంది. ఫలితాలే అందుకు నిదర్శనం. జట్టుగా మేం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. మ్యాచ్‌ గెలవాలంటే ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించాలి. అలా జరగకపోతే విజయాన్ని అందుకోవడం కష్టం. విజయం కోసం పోరాడాలనే పట్టుదలతోనే మా ప్లేయర్లు ఉంటారు. ప్రస్తుతం మేం కొన్ని మ్యాచులు ఓడిపోయాం. అయినప్పటికీ మేం ఇంకా టోర్నీలోనే ఉన్నాం. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఇంకా బయటకు వెళ్లలేదు. మాకూ అవకాశాలు ఉన్నాయి’ అని పొలార్డ్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

Updated Date - Apr 30 , 2026 | 02:38 PM