రూ.45 లక్షల కోసం కూతురి ఘాతుకం.. ప్రియుడితో కలిసి తల్లిని..
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:29 PM
రూ.45 లక్షల కోసం ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి తల్లిని అతి కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
రాంచీ, ఏప్రిల్ 30: డబ్బుల కోసం ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి తల్లిని అతి కిరాతకంగా చంపేసింది. హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే, అంత్యక్రియలు పూర్తయిన రెండు రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మనితోలాకు చెందిన నహిదా పర్వీన్ దంపతులకు పిల్లలు లేకపోవటంతో ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు. నాలుగేళ్ల క్రితం పర్వీన్ భర్త చనిపోయారు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుండటంతో పర్వీన్‌కు ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ కింద 45 లక్షల రూపాయల వచ్చాయి. బాలిక అర్బాజ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. 45 లక్షల రూపాయలు ఉన్న బ్యాంక్ అకౌంట్‌లోంచి డబ్బులు తీసి తరచుగా ప్రియుడికి ఇస్తోంది. పర్వీన్‌కు ఈ విషయం తెలియటంతో ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అర్బాజ్‌కు డబ్బులు ఇస్తే ఊరుకునేది లేదని పర్వీన్ హెచ్చరించింది. దీంతో బాలిక, అర్బాజ్ ఆగ్రహానికి గురయ్యారు.
ఎలాగైనా పర్వీన్ అడ్డుతొలగించి, డబ్బును సొంతం చేసుకోవాలని భావించారు. ఇందుకోసం మర్డర్ ప్లాన్ వేశారు. ఏప్రిల్ 24వ తేదీన రాత్రి బాలిక, అర్బాజ్, మరో ముగ్గురు కలిసి పర్వీన్‌ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. మరుసటి రోజు బాలిక తన బంధువులకు ఫోన్ చేసింది. తల్లి బాత్‌రూములో కిందపడి ప్రాణాలు కోల్పోయిందని చెప్పింది. 26వ తేదీన పర్వీన్ అంత్యక్రియలు జరిగాయి. అయితే, చాలా మందికి పర్వీన్ మరణంపై అనుమానం మొదలైంది.
ఆదివారం పర్వీన్ మరిది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు బాలికతో పాటు ఆమె ప్రియుడు అర్బాజ్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇదేంపని రామకృష్ణా..! ఏసీబీ వలలో వీఆర్వో
పశుసంవర్ధక రంగంలోకి రండి.. యువతకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు