Share News

ఆ బౌలర్‌కు బంతి ఇవ్వకుంటే ఆర్సీబీకి మంచిది: మాజీ క్రికెటర్

ABN , Publish Date - May 31 , 2026 | 04:14 PM

ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 ఆ బౌలర్‌కు బంతి ఇవ్వకుంటే ఆర్సీబీకి మంచిది: మాజీ క్రికెటర్
RCB vs Gujarat Titans

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL 2026) టైటిల్ గెలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి ఘట్టాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు.


గుజరాత్‌తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్‌ బౌలింగ్ వేయించొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్‌ సాల్ట్‌ తిరిగి వచ్చినా వెంకటేశ్‌ అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని క్రిష్ పేర్కొన్నాడు. ‘ఫిల్‌ సాల్ట్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నా వెంకటేశ్‌ అయ్యర్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్‌గా కొనసాగిస్తే ఆర్సీబీకి మేలు. బౌలింగ్ విషయంలో ఒకవేళ రొమారియో షెఫర్డ్‌తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం ఖాయం. షెఫర్డ్‌ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నా అభిప్రాయం ప్రకారం.. అతడికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వకపోవడం ఉత్తమం’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.


తాజా ఎడిషన్‌కు కూడా బెంగళూరు జట్టు రొమారియో షెఫర్డ్‌ను అట్టి పెట్టుకుంది. ఇక ఈ సీజన్‌లో అతడు.. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్‌ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్‌గా 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 83 పరుగులే సాధించాడు. చివరగా గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1లో షెఫర్డ్‌ ఒక ఓవర్‌ వేసి 15 పరుగులు ఇచ్చాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం!

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 31 , 2026 | 04:33 PM