Share News

సిరాజ్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:02 AM

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. జట్టు ఎంపికపై సెలక్టర్లే సమాధానం చెప్పాలని అన్నారు.

సిరాజ్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
Mohammed Siraj

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం రాజకీయ దుమారం రేగింది. సిరాజ్ ఎంపికపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం అతడి పేరు కారణంగానే సిరాజ్‌పై వివక్ష చూపి జట్టు నుంచి తప్పించారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. క్రీడల్లో మత రాజకీయాలు తగవని, దేశంలో ప్రతిభ ఆధారంగానే అవకాశాలు లభిస్తాయని హితవు పలికారు.


ఈ వివాదంపై తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సిరాజ్ ఎంపికపై నన్ను అడగొద్దు. అతడి ఎంపిక విషయంపై ప్రశ్నించడానికి నేనెవరిని?. దీనిపై నేను, నా లాంటి వాళ్లు వ్యాఖ్యానించకూడదు. సిరాజ్ ఎంపిక విషయంపై సెలక్టర్లే సమాధానం చెప్పాలి. వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. మనం అందరినీ సంతోషపెట్టలేం’ అని కపిల్ స్పష్టం చేశారు. ఒక వ్యవస్థను ఊరికే విమర్శించకూడదని, ప్రస్తుతం భారత క్రికెట్ బాగా ఆడుతోందని, అదే అన్నింటికంటే ముఖ్యమని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా తనకు సిరాజ్ అంటే ఇష్టమేనని, కానీ జట్టులో ఎవరు ఆడాలనేది సెలక్టర్లు, యాజమాన్యం, కెప్టెన్ నిర్ణయిస్తారని తెలిపారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే జట్టు ప్రణాళికలే ముఖ్యమని కపిల్ తేల్చిచెప్పారు.


మరోవైపు పిచ్ పరిస్థితులు, ఐదు రోజుల ఆటను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్‌లతో కూడిన పేస్ దళాన్ని ఎంచుకున్నామని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ .. తమ ఎంపికను సమర్థించుకున్నారు. అయితే సిరాజ్‌ను పక్కన పెట్టడంపై మాజీ దిగ్గజాలు రవిశాస్త్రి, సునీల్ గావస్కర్, రవిచంద్రన్ అశ్విన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ స్టార్..

కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. మూడో భారత ఓపెనర్‌గా రికార్డు!

Updated Date - Nov 21 , 2026 | 09:15 AM