అంతే దీటుగా..
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:05 AM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కూడా అదిరే ఆటను ప్రదర్శిస్తోంది. భారత పేసర్ల మాదిరి ఆరంభంలో కివీస్ బౌలర్లు కూడా ప్రభావం చూపుతారేమోనని...
మొదటి టెస్టు
జైస్వాల్, రాహుల్ అర్ధసెంచరీలు
భారత్ మొదటి ఇన్నింగ్స్ 159/1
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 368
గ్లెన్ ఫిలిప్స్ శతకం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కూడా అదిరే ఆటను ప్రదర్శిస్తోంది. భారత పేసర్ల మాదిరి ఆరంభంలో కివీస్ బౌలర్లు కూడా ప్రభావం చూపుతారేమోనని భావించినా.. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (89 బంతుల్లో 16 ఫోర్లతో 85) ఎదురుదాడే లక్ష్యంగా బ్యాటింగ్ సాగించాడు. వన్డే తరహా ఆటతో కదం తొక్కిన అతను కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (116 బంతుల్లో 5 ఫోర్లతో 52 బ్యాటింగ్) క్లాసిక్ ఆటతీరుతో అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు. వీరిద్దరి నిలకడ కారణంగా శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు క్రీజులో దేవ్‌దత్ పడిక్కళ్ (16 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 209 పరుగులు వెనుకంజలో ఉంది. అంతకుముందు 243/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. నికోల్స్ (175 నాటౌట్) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, ఫిలిప్స్ (118) సెంచరీ పూర్తి చేశాడు. బుమ్రాకు 4, ఆకాశ్ దీప్‌నకు 3, అన్షుల్‌కు 2 వికెట్లు దక్కాయి.
నికోల్స్ అదే జోరు: శుక్రవారం రెండో రోజు కివీస్ ఒకటిన్నర సెషన్ క్రీజులో గడిపింది. తొలి రోజు మాదిరే పట్టుదలగా ఆడిన నికోల్స్ తుది కంటా నిలిచాడు. ఇక 94 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఉన్న ఫిలిప్స్ చక్కటి కవర్‌డ్రైవ్‌తో కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఇక ప్రసిద్ధ్, అన్షుల్ రెండో కొత్త బంతితోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. బుమ్రా, ఆకాశ్ మాత్రమే ఒత్తిడి పెంచారు. దీంతో తొలి గంటపాటు నికోల్స్-ఫిలిప్స్ జోడీ ఇబ్బందిలేకుండా ఆడింది. చివరకు ఆకాశ్ భారత్ ఎదురుచూపులకు తెర దించుతూ, ఫిలిప్స్ వికెట్ తీయడంతో ఆరో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. లంచ్ బ్రేక్ తర్వాత స్మిత్ (14)తో కలిసి నికోల్స్ ఏడో వికెట్‌కు 32 రన్స్ జోడించాడు. అనంతరం 150 రన్స్ కూడా పూర్తి చేసుకున్న నికోల్స్ టెయిలెండర్ల సాయంతో స్కోరును 350 దాటించాడు.
ఆరంభంలో ఆచితూచి: కివీస్ ఆలౌటైన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో సెషన్‌లో ఎనిమిది ఓవర్లు మాత్రమే ఆడింది. అయితే హెన్రీ, జేమిసన్ పదునైన బంతులతో బెదర గొట్టడంతో ఓపెనర్లు జైస్వాల్-రాహుల్ మొదటి నాలుగు ఓవర్లను మెయిడెన్లుగా ముగించడం గమనార్హం.
ఎట్టకేలకు ఐదో ఓవర్‌లో జైస్వాల్ ఫోర్‌తో భారత్ పరుగుల బోణీ చేసింది. అటు జేమిసన్ ఓవర్‌లో ఎల్బీ రివ్యూ నుంచి ఊరట పొందిన రాహుల్‌కు హెన్రీ ఓవర్‌లో అదృష్టం వరించింది. అతడు వేసిన బంతి ప్యాడ్లకు తాకినా కెప్టెన్ లాథమ్‌కు నమ్మకం లేక రివ్యూకు వెళ్లలేదు. అయితే రీప్లేలో అతను స్పష్టంగా అవుటైనట్టు తేలడం గమనార్హం. అప్పటికి రాహుల్ ఐదు పరుగులతోనే ఉన్నాడు. ఆ వెంటనే జైస్వాల్ క్యాచ్‌ను గల్లీలో ఫిలిప్స్ వదిలేయడం కలిసివచ్చింది. 16/0తో టీ బ్రేక్ వెళ్లిన భారత్ చివరి సెషన్‌లో జోరు పెంచింది. ఇద్దరూ అడపాదడపా ఫోర్లతో స్కోరును కదిలించారు. అలాగే డఫీ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన జైస్వాల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం వేగం పెంచి సెంచరీ ఖాయమనిపించాడు. అయితే 28వ ఓవర్‌లో కీపర్ బ్లండెల్‌కు జైస్వాల్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ నిరాకరించినా.. కివీస్ డీఆర్‌ఎస్ తీసుకుని ఫలితం సాధించింది. దీంతో తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. గత 17 టెస్టుల్లో భారత ఓపెనర్లు సెంచరీ పార్ట్‌నర్‌షిప్ అందించడం ఇదే తొలిసారి. అనంతరం రాహుల్ కూడా అర్ధసెంచరీ సాధించి దేవ్‌దత్‌తో మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించాడు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) బుమ్రా 0, కాన్వే (సి) పంత్ (బి) అన్షుల్ 4, నికోల్స్ (నాటౌట్) 175, రచిన్ (సి) పంత్ (బి) ఆకాశ్ 15, మిచెల్ (సి) జైస్వాల్ (బి) బుమ్రా 1, బ్లండెల్ (సి) గిల్ (బి) బుమ్రా 5, ఫిలిప్స్ (బి) ఆకాశ్ 118, స్మిత్ (ఎల్బీ) ప్రసిద్ధ్ 14, జేమిసన్ (సి) రాహుల్ (బి) ఆకాశ్ 11, హెన్రీ (ఎల్బీ) బుమ్రా 1, డఫీ (సి) పంత్ (బి) అన్షుల్ 4; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 121 ఓవర్లలో 368 ఆలౌట్; వికెట్లపతనం: 1-2, 2-12, 3-51, 4-52, 5-70, 6-286, 7-318, 8-343, 9-348, 10-368. బౌలింగ్: బుమ్రా 29-8-92-4, అన్షుల్ 23-5-69-2, ఆకాశ్ 23-7-53-3, ప్రసిద్ధ్ 26-2-100-1, సుందర్ 20-2-45-0.
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్లండెల్ (బి) హెన్రీ 85, రాహుల్ (బ్యాటింగ్) 52, దేవ్‌దత్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 39 ఓవర్లలో 159/1. వికెట్ పతనం: 1-130. బౌలింగ్: హెన్రీ 12-3-43-1, జేమిసన్ 11-5-15-0, డఫీ 10-0-72-0, స్మిత్ 6-0-29-0.
1
1994 తర్వాత కివీస్ గడ్డపై జరిగిన టెస్టుల్లో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించిన భారత ఓపెనర్లుగా జైస్వాల్-రాహుల్
1
అన్ని ‘సెనా’ (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపైనా హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్.
ఇవి కూడా చదవండి:
'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!
ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా