Share News

టీమిండియా యువ హిట్టర్ వైభవ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:09 PM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, వైభవ్‌కు అసలైన సవాలు ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీమిండియా యువ హిట్టర్ వైభవ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kapil Dev on Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, వైభవ్‌కు అసలైన సవాలు ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు సచిన్ కంటే తక్కువ వయసులోనే టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు వైభవ్.


ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. 'వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు. ప్రస్తుతం అతడిది చాలా చిన్న వయసు. 20 నుంచి 22 ఏళ్ల వయసుకు చేరుకున్నాకే అతడి అసలైన ప్రతిభను మనం అంచనా వేయగలం. 20 ఏళ్ల తర్వాతనే అతడి ఆటను జడ్జ్ చేద్దాం. 16 ఏళ్ల వయసులో సచిన్ ఎలా ఉన్నాడో, వైభవ్ కూడా అలాగే కనిపిస్తున్నాడు. కానీ, సచిన్‌లా సుదీర్ఘ కాలం పాటు ఆడగలడా? అనేది కాలమే నిర్ణయించాలి. అతడు ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉంది' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.


ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో కాస్త ఫామ్ కోల్పోయిన వైభవ్.. ఫైనల్లో మాత్రం 94 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026, ఇటీవల జరిగిన ట్రై సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల కోసం భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం జరగబోయే మ్యాచ్‌తో వైభవ్ అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సందర్భంగా వైభవ్‌తో పాటు భారత జట్టు మొత్తానికి కపిల్ దేవ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి దూసుకెళ్లిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట విషాదం

Updated Date - Jun 24 , 2026 | 05:20 PM