Share News

లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య.. డోరు మూసే విషయంలో గొడవై..

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:41 PM

ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు.

లోకల్ ట్రైన్‌లో దారుణ హత్య.. డోరు మూసే విషయంలో గొడవై..
Mumbai Local Train

ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టూ జనం ఉండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం దర్జాగా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మయాంక్ లోహార్ మంగళవారం రాత్రి చర్చ్‌గేట్ నుంచి నల్లసోపారా వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కాడు.


గోరేగావ్ - కందివాలి మధ్యలో తోటి ప్రయాణికుడితో మయాంక్‌కు గొడవైంది. వర్షం పడుతుండటంతో డోరు క్లోజ్ చేసే విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి మయాంక్‌పై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మయాంక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ఏడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.


ఈ సంఘటనపై బోరివాలి రైల్వే పోలీస్ అధికారి దత్త ఖుప్రేకర్ మాట్లాడుతూ.. ‘వర్షం పడుతుండగా డోరు మూసే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిని కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఇక, సోషల్ మీడియాలో సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జనం.. ‘ఇతడు అతడిని చంపేశాడు. చంపేశాడు’ అంటూ అరుస్తున్నారు. డోరు దగ్గర మయాంక్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది.


ఇవి కూడా చదవండి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక ఘట్టం.. భూసేకరణ ప్రక్రియ షురూ

విషాదం.. హాస్టల్ బాత్‌రూంలో యువతి ప్రసవం.. నవజాత శిశువు మృతి

Updated Date - Jun 24 , 2026 | 04:45 PM