విషాదం.. హాస్టల్ బాత్‌రూంలో యువతి ప్రసవం.. నవజాత శిశువు మృతి
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:07 PM
గోల్కొండలోని ఓ హాస్టల్‌లో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూంలో ఓ యువతి ప్రసవించగా, నవజాత శిశువు మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్: గోల్కొండ ప్రాంతంలో ఉన్న ఓ విద్యార్థినుల హాస్టల్‌లో జరిగిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి బాత్‌రూంలో ప్రసవించగా, అనంతరం నవజాత శిశువు మృతి చెందడం ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, హాస్టల్‌లో నివసిస్తున్న యువతి అకస్మాత్తుగా బాత్‌రూంలో ప్రసవించింది. అనంతరం శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. శిశువు వెంటిలేటర్ ప్రాంతం నుంచి కింద పడేయడంతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శిశువు మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం యువతి గర్భవతి అనే విషయం హాస్టల్ సిబ్బందికి తెలియకపోవడం. హాస్టల్‌లోనే ఉంటున్న విద్యార్థిని గర్భవతి అయినప్పటికీ ఎవరూ గుర్తించలేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దీనిపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు, శిశువు మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. యువతి గర్భానికి, శిశువు మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా యువతి బావ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read:
భారీ వర్షాలు.. మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి..
ఆ నలుగురివి మాయమాటలు.. ప్రజలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క