Share News

భారీ వర్షాలు.. మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి..

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:55 PM

ముంబై మేయర్ రీతూ తావ్డే ఫుట్‌పాత్‌పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు. రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.

భారీ వర్షాలు.. మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి..
BMC Worker

ఇంటర్‌నెట్ డెస్క్: నైరుతి రుతుపవనాలు నిన్న (మంగళవారం) ముంబై నగరాన్ని చేరుకున్నాయి. దీంతో నగరంలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం మేయర్ రీతూ తావ్డే వర్ష పరిస్థితులను సమీక్షించటం కోసం బయటకు వచ్చారు. దాదార్, హింద్‌మాతా, గాంధీ మార్కెట్ ఏరియాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. రీతూ తావ్డే ఫుట్‌పాత్‌పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు.


రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. డ్రైనేజీ నీటితో పూర్తిగా కప్పబడిపోయిన మ్యాన్‌హోల్‌ను అతడు గుర్తించలేకపోయాడు. అటువైపు నడుచుకుంటూ వచ్చి అందులో పడిపోయాడు. మేయర్ వెంట ఉన్న సిబ్బంది వెంటనే స్పందించారు. అతడిని బయటకు తీసుకువచ్చారు. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఆ వ్యక్తిని బీఎంసీలో పని చేసే పారిశుద్ధ్య కార్మికుడిగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో మేయర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్స్ తెరిచి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


రీతూ తావ్డే మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాన్‌హోల్ శుభ్రం చేయటం కోసం దాని మూతను తెరిచి ఉంచారు. దాని చుట్టూ హెచ్చరిక బోర్డులను కూడా ఉంచారు. రోడ్డుపై అలాంటి హెచ్చరిక బోర్డులు ఉన్నపుడు జనం జాగ్రత్తగా ఉండాలి. బీఎంసీ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను, గోడలపై అతికించిన పోస్టర్లను ప్రజలు ఒకటికి రెండు సార్లు చదవాలని కోరుతున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

కాపులను వైసీపీ వినియోగించుకుంది... గౌరవించలేదు: సోమువీర్రాజు

సాయంత్రం 4 తర్వాత కాఫీ తాగుతున్నారా? బీ కేర్ ఫుల్

Updated Date - Jun 24 , 2026 | 04:41 PM