Share News

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:13 PM

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. అతడికి తుది జట్టులో స్థానం లభిస్తే 6 దశాబ్దాల తర్వాత ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ ఆసీస్ క్రికెటర్ అవుతాడు.

ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి క్రికెటర్.. ఎవరీ నిఖిల్?
Nikhil Chaudhary

ఇంటర్నెట్ డెస్క్: నిఖిల్ చౌదరి.. ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రానికి సిద్ధంగా ఉన్న భారత సంతతి ఆల్‌రౌండర్. అతడికి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కింది. జూన్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో అతడికి తుది జట్టులో చోటు లభిస్తే.. 6 దశాబ్దాల తర్వాత ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి క్రికెటర్ అవుతాడు. అంతకుముందు సెల్లార్స్ అనే ఇండియన్.. కంగారూ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.


30 ఏళ్ల నిఖిల్ ఢిల్లీలో జన్మించాడు. కుడిచేతి వాటం బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్‌గా ఆల్‌రౌండ్ పాత్ర పోషిస్తున్న నిఖిల్.. టీమ్ఇండియా ప్రస్తుత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మలతో పాటు భారత్‌లో యూత్ క్రికెట్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌తో ట్రయల్స్‌లోనూ పాల్గొన్నాడు. 2017లో హరియాణా తరఫున లిస్ట్-ఏ, టీ20లలో అరంగేట్రం కూడా చేశాడు.


2020లో తన మామను కలిసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు వెళ్లిన నిఖిల్.. కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత అక్కడే క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రారంభ రోజుల్లో జీవనోపాధి కోసం మెక్సికన్ రెస్టారెంట్‌లో పనిచేయడంతో పాటు పోస్టుమ్యాన్‌గానూ పనిచేశాడు నిఖిల్.


ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ సిఫార్సు మేరకు అతణ్ని బిగ్‌బాష్ లీగ్ జట్టు హోబర్ట్ హరికేన్స్ ఎంపిక చేసుకుంది. 2023-24 సీజన్ నుంచి హరికేన్స్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉంటూ ఆ జట్టు తరపున 32 మ్యాచ్‌లు ఆడి 693 పరుగులు చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో అతను లీగ్ గెలిచిన హరికేన్స్ 2024-25 జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలి బీబీఎల్ టోర్నమెంట్‌లో అతను 12 ఇన్నింగ్స్‌లలో 153.50 స్ట్రైక్ రేట్‌, 30.7 సగటుతో 307 పరుగులు చేశాడు.


వాస్తవానికి నిఖిల్‌ ఇంకా ఆస్ట్రేలియా పౌరసత్వం పొందలేదు. అయినప్పటికీ.. శాశ్వత నివాస హోదా కలిగి ఉండటంతో ఐసీసీ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ జట్టు తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు. కాగా.. ఆసీస్ తరఫున ఆడిన చివరి భారత సంతతి క్రికెటర్ రెక్స్ సెల్లార్స్. అతడు 1964లో కోల్‌కతాలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆడాడు.


ఇవీ చదవండి:

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 11 , 2026 | 05:47 PM