Share News

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:48 PM

ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Abhishek Sharma Century

స్పోర్ట్స్ డెస్క్: ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(113) మెరుపు సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మకు తోడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(45) కూడా రాణించడంతో 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. ఈ విజయంతో 3-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.


మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలోడారిల్ మిచెల్(89) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలానే ఫిన్ అలెన్ 40, బెవాన్ జాకబ్స్ 39 పరుగులతో రాణించాడు. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్(2) స్వల్ప పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ అలెన్‌తో కలిసి మిచెల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో జాకబ్స్ దూకుడుగా ఆడటంతో కివీస్ జట్టు 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు.


ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్ల ఆశలు ఎంతో సేపు నిలవలేదు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా బౌండరీలు బాదారు. మొత్తంగా అభిషేక్‌ శర్మ (113) విధ్వంసకర శతకంతో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ 45, సంజూ శాంసన్ 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిసన్ రెండు వికెట్లు సాధించగా.. శాంట్నర్, మాథ్యూ ఫిషర్ చెరో వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 150 వికెట్లకు ఒక్క అడుగు దూరంలో!

బాలెన్ డి ఓర్ అవార్డు: ఈ విజయానికి అర్హుడివి.. హ్యారీ కేన్‌‌కు కోహ్లీ స్పెషల్ విషెస్!

Updated Date - Oct 27 , 2026 | 04:09 PM