Share News

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:50 PM

భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. 2026-27కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే వన్డే మ్యాచులు తొమ్మిది ఉన్నాయి.

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్
India home season 2026-27

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాకు సంబంధించి 2026-27 హోం సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ(గురువారం) విడుదల చేసింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు పర్యటనకు వస్తాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిల్లో 9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్టులు ఉన్నాయి. 2026-27 హోం సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్ పర్యటనతో ప్రారంభమై.. 2027 మార్చి3తో ముగుస్తుంది. టీమిండియా విండీస్ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డేలు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్‌లో.. టీ20లు లఖ్‌నవూ, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి.


వెస్టిండీస్ తర్వాత డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగనున్నాయి. వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనుండగా.. టీ20లు రాజ్‌కోట్, కటక్, పూణేలో షెడ్యూల్‌ అయ్యాయి. ఇక 2027 జనవరిలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ రెండు జట్ల మధ్య కోల్‌కతా, హైదరాబాద్, ముంబై వేదికగా మూడు వన్డేలు జరగనున్నాయి.


ఈ హోం సీజన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భాగం ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం​ ఆస్ట్రేలియా జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ 21వ తేదీ నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరగనుంది. తరువాతి మ్యాచ్‌లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లో జరుగుతాయి. మొత్తంగా ప్రపంచ కప్‌ 2027 లక్ష్యంగా వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆటను తొమ్మిది మ్యాచుల్లో చూసే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం.. టీ20లు రాత్రి 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2 గంటలకు, టెస్టులు ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయి.


ఇవి కూడా చదవండి:

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

ముంబైకి సాధ్యమా?

Updated Date - Mar 26 , 2026 | 05:23 PM