ఆర్సీబీకి అందేనా మళ్లీ!
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:56 AM
ఐపీఎల్ డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేపర్‌పై బలంగా, సమతుల్యంగా కనిపిస్తోంది. కానీ, వాస్తవంలో ఆ టీమ్ పరిస్థితి మరోలా ఉంది. గాయాలు, పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్లేయర్లతో...
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఐపీఎల్ డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేపర్‌పై బలంగా, సమతుల్యంగా కనిపిస్తోంది. కానీ, వాస్తవంలో ఆ టీమ్ పరిస్థితి మరోలా ఉంది. గాయాలు, పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్లేయర్లతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు ప్రధాన ఆకర్షణ. 2025 సీజన్‌లో ఎవరి పాత్ర ఏంటో స్పష్టంగా తెలియడంతో.. అందరూ సమష్టిగా ఆడారు. దీంతో ఆర్సీబీ తొలిసారి టైటిల్ కలను నెరవేర్చుకొంది. కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకొన్నా.. ఈసారి మాత్రం జట్టు అంచనాలను అందుకొంటుందా? అనే అనుమానం కలుగుతోంది. గతేడాది బెంగళూరుకు టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన పేసర్ హాజెల్‌వుడ్ ఫిట్‌నెస్ లేమితో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానుండడం ఆందోళన కలిగించే విషయం. టైటిల్ నిలబెట్టుకొనేందుకు ఆరంభం నుంచే అదరగొట్టాల్సిన బెంగళూరు.. ఆదిలోనే సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
బలం
ఆర్సీబీ ప్రధాన బలం సమతుల్యతే. గతంలో బ్యాటింగ్ బలంతో సాగిన జట్టు.. టైటిల్ నిరీక్షణకు తెరదించేందుకు వ్యూహాత్మ నిర్ణయాలు తీసుకొంది. కోర్ టీమ్‌ను రిటైన్ చేసుకొన్న బెంగళూరు.. మినీ వేలంలో లోటుపాట్లను సవరించుకొంది. సాల్ట్, కోహ్లీ టాపార్డర్ బలంగా కనిపిస్తుండగా.. కెప్టెన్ రజత్ పటీదార్, క్రునాల్ పాండ్యాతోపాటు రొమారియో షెపర్డ్‌లాంటి ఫినిషర్లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక, బౌలింగ్ విభాగంలో దూకుడుతోపాటు అనుభవానికి పెద్దపీట వేశారు. గాయం నుంచి కోలుకొని హాజెల్‌వుడ్ జట్టులోకి వస్తే పేస్ దాడి మరింత పదునుతేలనుంది. క్లిష్టసమయాల్లో కూడా ఒత్తిడి గురికాకుండా నిలకడగా ఆడుతుండడం ఆర్సీబీకి ప్లస్‌గా మారింది.
బలహీనతలు
జట్టులో చాలా మంది ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ సరిగా లేదు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ పోటీ క్రికెట్ ఆడి నెలలవుతోంది. జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ బరిలోకి దిగాడు. పేసర్ భువనేశ్వర్ కూడా ముస్తాక్ అలీ టోర్నీ తర్వాత మ్యాచ్‌లు ఆడలేదు. ఇలా ప్లేయర్లు గాడిలో పడేందుకు కొంత సమయం తీసుకొంటే.. అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే చాన్సుంది. బెంగళూరు బౌలింగ్ ఎక్కువగా హాజెల్‌వుడ్‌పైనే ఆధారపడడం కూడా బలహీనతగా మారింది. పైగా డిఫెండింగ్ చాంప్ అనే అంచనాలు కూడా ఒత్తిడి పెంచేలా ఉన్నాయి.
అంచనా
ఆల్‌రౌండర్లు అధికంగా ఉండడంతో జట్టు ఎలాగోలా నెట్టుకొస్తుందని భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ను భయపెట్టిన బెథల్ లాంటి ఆటగాడితో జట్టులో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. క్రమంగా పుంజుకొని మరోసారి నాకౌట్ చేరగలదనే లెక్కలు వేస్తున్నారు.
జట్టు
బ్యాటర్లు: రజత్ పటీదార్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్.
ఆల్ రౌండర్లు: క్రునాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్.
బౌలర్లు: జోష్ హాజెల్‌వుడ్, రసిక్ దర్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, యష్ దయాళ్.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్