Share News

ముంబైకి సాధ్యమా?

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:00 AM

ఐపీఎల్‌పై ముంబై ఇండియన్స్‌ది చెరగని ముద్ర. ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడం లీగ్‌లో ఆ జట్టు ఆధిపత్యానికి నిదర్శనం. కానీ గత ఐదు సీజన్లుగా ముంబై ప్రదర్శన అత్యంత పేలవంగా...

ముంబైకి సాధ్యమా?

ఐపీఎల్‌ 2 రోజుల్లో

ఐపీఎల్‌పై ముంబై ఇండియన్స్‌ది చెరగని ముద్ర. ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడం లీగ్‌లో ఆ జట్టు ఆధిపత్యానికి నిదర్శనం. కానీ గత ఐదు సీజన్లుగా ముంబై ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. 2022, 2024లో అయితే 10వ స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది. 2023లో కాసింత మెరుగ్గా మూడో స్థానం దక్కించుకుంది. 2021ని ఐదో స్థానంతో ముగించింది. గతసారి క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమితో మూడో స్థానంతో వెనుదిరిగింది. సుదీర్ఘకాలం ముంబై కెప్టెన్‌గా వ్యవహరించి లీగ్‌లో జట్టును అత్యున్నత స్థాయికి చేర్చిన రోహిత్‌ శర్మను పక్కనబెట్టి హార్దిక్‌ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ఓ సంచలనం. రోహిత్‌ను సారథిగా తప్పించడాన్ని ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ చాలాకాలంపాటు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాకు అవమానాలూ ఎదురయ్యాయి. మొత్తంగా సంధి దశనుంచి బయటపడిన ముంబై ఇండియన్స్‌ ఈసారి లీగ్‌లో బలమైన జట్లలో ఒకటి. మరిక ముంబై ఇండియన్స్‌ జట్టు టైటిళ్ల ‘సిక్సర్‌’ కొడుతుందేమో చూడాలి.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

బలం

కోర్‌ క్రికెటర్లను అట్టిపెట్టుకున్న ముంబై ఇండియన్స్‌ గత మినీ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ విల్‌జాక్స్‌ను కొనుగోలు చేసి బౌలింగ్‌ విభాగాన్ని పటిష్ట పరుచుకుంది. పవర్‌ హిట్టర్‌ షెర్ఫానే రూథర్‌ఫోర్డ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి, మరో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను లఖ్‌నవూనుంచి ట్రేడింగ్‌ చేసుకుంది. 2019-21 సీజన్లలో పరుగులు వరద పారించిన క్వింటన్‌ డికాక్‌ను మళ్లీ తెచ్చుకుంది. ఈ దక్షిణాఫ్రికా స్టార్‌ రాకతో ముంబై బ్యాటింగ్‌ మరింత బలపడింది. రోహిత్‌ శర్మ, డికాక్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌వర్మ, విల్‌జాక్స్‌, హార్దిక్‌ పాండ్యా, నమన్‌ ధిర్‌ల దూకుడైన బ్యాటింగ్‌ తోడైతే ముంబైకి తిరుగుండదు. ఇక లోయరార్డర్‌లో మిచెల్‌ శాంట్నర్‌ బ్యాటింగ్‌ సత్తా అందరికీ తెలిసిందే. బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌తో కూడిన పేస్‌ బౌలింగ్‌ విభాగాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాలే. తన నాయకత్వంలో న్యూజిలాండ్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేర్చిన శాంట్నర్‌ స్పిన్‌ బౌలింగ్‌తో జట్టుకు సమతూకం తెస్తాడు.

బలహీనత

వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్‌ శాంట్నర్‌తో స్పిన్‌ బాధ్యతలు పంచుకొనే అనుభవజ్ఞుడైన భారత బౌలర్‌ లేకపోవడం ముంబై జట్టులో ప్రధాన లోటు. చెన్నై, లఖ్‌నవూ వంటి టర్నింగ్‌ పిచ్‌లపై మయాంక్‌ మార్కండే, కొత్తగా తీసుకొన్న అథర్వ అంకోలేకర్‌ ఎలా రాణిస్తారనేది ప్రశ్నార్థకం.


జట్టు

బ్యాటర్లు: రోహిత్‌ శర్మ, డికాక్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్‌, డానిష్‌ మలేవార్‌.

ఆల్‌రౌండర్లు: హార్దిక్‌ పాండ్యా, విల్‌ జాక్స్‌, శాంట్నర్‌, రాజ్‌ బజ్వా, కార్బిన్‌ బాష్‌, శార్దూల్‌, మయాంక్‌ రావత్‌, అథర్వ అంకోలేకర్‌, రాబిన్‌ మిన్జ్‌, రికెల్టన్‌, నామన్‌ ధిర్‌.

బౌలర్లు: బుమ్రా, దీపక్‌ చాహర్‌, అశ్వనీ కుమార్‌, బౌల్ట్‌, మహ్మద్‌ ఇజార్‌, అల్లా ఘజన్ఫర్‌, రఘు శర్మ, మార్కండే.

అంచనా

అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ముంబై టైటిల్‌ రేసులో ఉన్న ప్రధాన జట్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 02:00 AM