ఒలింపిక్స్2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:47 PM
దాదాపు శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ సోమవారం కీలకమైన అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: నిన్న(ఆదివారం) టీమిండియా అభిమానులకు బ్లాక్ డే. పురుషుల, మహిళల క్రికెట్ జట్లు రెండూ ఓడిపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. 2028లో లాస్ ఏంజెలెస్ జరిగే ఒలింపిక్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్లు పాల్గొననుంది. అలానే పురుషుల జట్టు కూడా మార్గం సుగమం కానుంది. ఈ సారి జరిగే విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చేరుస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ ఇవాళ(సోమవారం) అత్యంత కీలకమైన అర్హత ప్రమాణాలను (Qualification Criteria) ప్రకటించింది.
2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (LA28) వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి. ఐసీసీ విడుదల చేసిన ఈ నిబంధనల ప్రకారం.. భారత మహిళల జట్టు ఇప్పటికే ఒలింపిక్స్ అర్హత సాధించగా, పురుషుల జట్టుకు మాత్రం 2026 డిసెంబర్ నాటి ర్యాంకింగ్స్ కీలకం కానున్నాయి. ప్రస్తుతం పురుషుల క్రికెట్‌లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి పురుషుల జట్టు అర్హత కూడా దాదాపు లాంఛనమే.
మహిళల విభాగంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఆధారంగా తొలి నాలుగు స్థానాలను ఖరారు చేశారు. నాలుగు వేర్వేరు ఖండాల (Continents) నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్ (ఆసియా), ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా), ఇంగ్లండ్ (యూరప్) జట్లు సెమీఫైనల్స్ చేరడం ద్వారా నేరుగా ఒలింపిక్స్ బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి.
అలానే ఆతిథ్య దేశ హోదాలో అమెరికా పురుషుల, మహిళల జట్లు టాప్-15 ర్యాంకింగ్స్‌లో ఉంటే నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఒకే ఒక్క స్థానం కోసం 2027లో ప్రత్యేకంగా 'ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్' టోర్నమెంట్ నిర్వహిస్తారు. కాగా, వెస్టిండీస్ జట్టు ఐసీసీ గుర్తింపు పొందినప్పటికీ.. దానికి ప్రత్యేక ఒలింపిక్ కమిటీ లేనందున, కరేబియన్ దీవుల దేశాలు విడివిడిగా ఈ క్వాలిఫైయర్‌లో తలపడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌లో ప్రతి జట్టులో 15 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం
పాక్ క్రికెట్‌లో పెను మార్పులు.. షాహీన్ అఫ్రిది, నసీమ్‌లపై వేటు!