భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుంది: ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా
ABN , Publish Date - Jun 29 , 2026 | 03:10 PM
భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక, వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ, జూన్ 29: భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక, వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన 20వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్ఠమైన రికవరీని సాధించిందని మిశ్రా అన్నారు.
డేటా ఆధారిత నిర్ణయాలే 'వికసిత్ భారత్'కు పునాది
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం సాక్ష్యాధారాలు, కచ్చితమైన డేటా ఆధారంగానే ఉంటుందని పీకే మిశ్రా వివరించారు. 'మనం సాధించే ప్రగతిని, పథకాల అమలును నిరంతరం కొలవడానికి డేటా ఎంతో అవసరం. 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ డేటా ఆధారిత నిర్ణయాలే దిక్సూచిగా మారనున్నాయి' అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం.. ప్రభుత్వ శాఖలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(DPI) ద్వారా భారీ మొత్తంలో డేటా అందుబాటులోకి వస్తోందని మిశ్రా చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖల డిజిటల్ కార్యకలాపాల ద్వారా జనరేట్ అవుతున్న డేటాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం పలు అంశాలపై దృష్టి సారించిందని మిశ్రా తెలిపారు. విభిన్న శాఖల డేటాను ఒకదానితో ఒకటి అనుసంధానించేలా చేయడం, సంప్రదాయ సర్వే డేటాతో ఈ అడ్మినిస్ట్రేటివ్ డేటా సరిపోలేలా నాణ్యతను మెరుగుపరచడం, అధికారిక గణాంకాల పరిధిని విస్తృతం చేస్తూ నమ్మకమైన సమాచారాన్ని అందుబాటులోకి తేవడం వీటి ప్రధాన ఉద్దేశమని మిశ్రా వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్ర, మానవ వనరులు
నిర్ణయాలను మరింత సమగ్రంగా, వేగంగా తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుందని మిశ్రా అభిప్రాయపడ్డారు. అయితే, అదే సమయంలో సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకునేలా మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. AI అందించే ఫలితాలను క్షేత్రస్థాయిలో సరిచూసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్