అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:11 PM
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం(మే 20న) చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. ఇప్పటికే మొదటి రెండు వన్డేల్లో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు ముందు సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలి గాయానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో అతను ప్రపంచకప్2026తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ 2026కు కూడా దూరమయ్యాడు. కాగా, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో రిహాబ్ పూర్తి చేసుకున్న హర్షిత్ రాణా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, చెన్నైలో వన్డే జట్టుతో చేరాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. 24 ఏళ్ల రాణా ఇప్పటివరకు టీమిండియా తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ లో హర్షిత్ రానా భారత్ తరఫున ఆడాడు. అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేతో పాటు త్వరలో వెళ్లనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం కూడా అతడిని ఎంపిక చేశారు.
మూడో వన్డేకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.
ఇవి కూడా చదవండి:
మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..
'దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా'.. భజ్జీకి శ్రీశాంత్ సవాల్!