టీ20 డబ్ల్యూసీ: టీమిండియా గెలుపుకు 5 కారణాలు ఇవే!
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:01 PM
టీ20 ప్రపంచ కప్ 2026 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ముచ్చటగా మూడోసారి ఐసీసీ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. అయితే భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవడం వెనుక ఐదు కారణాలు ఉన్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ముచ్చటగా మూడోసారి ఐసీసీ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. టోర్నీ ప్రారంభం తర్వాత భారత జట్టు ప్రదర్శన చూసిన ఏ క్రికెట్ అభిమాని...టైటిల్ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో లేరు. యూఎస్ఏ, నమీబియా లాంటి జట్లపై గెలుపు కోసం టీమిండియా కాస్త కష్టపడాల్సి వచ్చింది. అలాంటి దశ నుంచి ఏకంగా టైటిల్ నే అందుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవడం వెనుక ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి.. అవి ఏంటో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
1. క్లిష్ట పరిస్థితిలో ప్రధాన బౌలర్ల అద్భుత ప్రదర్శన
ఏ జట్టుకైన క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకునే బౌలర్లు కొందరు ఉంటారు. అలానే టీమిండియాకు కూడా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, హార్ధిక్ పాండ్య.. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఫలితంగా సూపర్-8 లో వెస్టిండీస్, సెమీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ పై, ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్ మ్యాచ్ లో అయితే ఓటమి అంచున ఉన్న భారత జట్టును.. తన చక్కటి బౌలింగ్ తో బుమ్రా గెలిపించాడు.
2. సరైన సమయంలో సంజు శాంసన్ ఫామ్ లోకి రావడం
ఈటోర్నీలో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా జరిగింది. టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో సంజు విఫలమయ్యాడు. ఆ తర్వాత ఈ ఐసీసీ టోర్నీలో తొలి రెండు మ్యాచుల సమయంలో బెంచ్ కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఊహించని విధంగా తుది జట్టులో స్థానం దక్కించుకుని సూపర్-8, సెమీ ఫైనల్స్ లాంటి కీలక మ్యాచుల్లో సూపర్ ఫామ్ అందుకున్నాడు.
3. రాణించిన టీమిండియా ఆల్ రౌండర్లు
టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివం దూబే కీలక పాత్ర పోషించారు. ఇటు బ్యాటుతో, అటు బంతితో మంచి ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్య, శివం దూబేలు బ్యాటింగ్ లో అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు రాబట్టారు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో శివం దూబెే 8 బంతుల్లో 26 పరుగులు చేశాడంటే.. ఏ స్థాయిలో చేలరేగాడో అర్ధం చేసుకోవచ్చు. అలానే బంతితో సైతం ఈ ఆల్ రౌండర్లు చక్కటి ప్రదర్శన చేశారు.
4. జస్ప్రీత్ బుమ్రా ప్రభావం
జట్టు క్రీడలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించడం అన్యాయంగా అనిపించవచ్చు. కానీ భారత జట్టుపై జస్‌ప్రీత్ బుమ్రా ప్రభావం విస్మరించలేనంత ముఖ్యమైనది. ఈ టోర్నీతో బుమ్రా కేవలం స్ట్రైక్ బౌలర్ కంటే ఎక్కువ స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అతని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. చివరి మూడు ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టుకు 45 పరుగులు అవసరం కాగా 18వ ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా.. ఆట స్వరూపాన్ని మార్చేశాడు. అలానే ఫైనల్లో, బుమ్రా మరోసారి ఒత్తిడిలో బౌలింగ్ వేసి, అద్భుతమైన 4 వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చివేశాడు. టోర్నమెంట్‌లో 8 మ్యాచ్‌లలో, బుమ్రా 14 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
5. రెండేళ్ల కచ్చితమైన ప్రణాళిక
టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ను సైతం టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. సాధారణంగా అలా ఛాంపియన్ గా నిలిచిన జట్టునే తర్వాత టోర్నీకి దాదాపు కొనసాగిస్తారు. అయితే అందుకు భిన్నంగా టీమిండియా మేనేజ్‌మెంట్ క్రమంగా పాత ప్లేయర్లకు గుడ్ బై చెబుతూ.. కొత్త తరం ఆటగాళ్లను పరిచయం చేసింది. 2024 నుంచి 2026 వరకు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లను విస్తృతంగా తీర్చిదిద్దారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్ వంటి టోర్నమెంట్‌ల ద్వారా, ఈ జట్టు ఎంతో అనుభవాన్ని పొందింది. అలానే జట్టులో కెమిస్ట్రీని అభివృద్ధి చేసింది.
ఇవి కూడా చదవండి:
సోదరి మృతి.. కన్నీళ్లను ఆపుకుని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్!
మీ ముఖంపై చిరునవ్వు సూపర్.. గంభీర్‌పై ధోని ఆసక్తికర పోస్ట్