సీఈసీ గోబ్యాక్ నినాదాలు, నల్లజెండాలతో నిరసనలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:52 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు కోల్‌కతాలో నిరసనల సెగ తగిలింది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
కోల్‌కతా: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar)కు కోల్‌కతా (Kolkata)లో నిరసనల సెగ తగిలింది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు సకాలంలో పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఆయన ఆలయాన్ని దర్శించుకున్నారు. బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన అనంతరం తొలిసారి సీఈసీ ఆదివారం రాత్రి కోల్‌కతా వచ్చారు. విమానాశ్రయం వద్ద కూడా ఆయనకు ఇదే తరహా నిరసనలు ఎదురయ్యాయి.

విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా టీఎంసీ కార్యకర్తలను ఆయనను టార్గెట్ చేసుకుని 'గో బ్యాక్' నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్ వెళ్తున్న దారిలో నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. వామపక్ష పార్టీలు ఎయిర్‌పోర్ట్ బయట నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అయితే పరిస్థితలు చేజారిపోకుండా పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లను సమీక్షించేందుకు మూడ్రోజుల పర్యటనకు సీఈసీ కోల్‌కతా వచ్చారు. రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు.
సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కూడా ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనున్నారు. శాంతి భద్రతల పరిస్థితి, చేయాల్సిన ఏర్పాట్లు, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధానంగా సీఈసీ టీమ్ సమీక్షించనుంది. బూత్ స్థాయి అధికారులతోనూ సమావేశం కానుంది. పర్యటన చివర్లో మీడియా సమావేశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
టీవీకే, ఎన్డీయే పొత్తుపై నైనార్ నాగేంద్రన్ కార్లిటీ
కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు