Share News

మీ ముఖంపై చిరునవ్వు సూపర్.. గంభీర్‌పై ధోని ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:09 PM

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు.

మీ ముఖంపై చిరునవ్వు సూపర్.. గంభీర్‌పై  ధోని ఆసక్తికర పోస్ట్
T20 World Cup 2026 India win

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. 'కోచ్‌ సాబ్‌ ముఖంపై చిరునవ్వు చాలా ప్రత్యేకం. మ్యాచ్ గెలవాలనే ఆయన తపన, అదే సమయంలో ప్రశాంతంగా ఉండే ఆ చిరునవ్వు.. రెండు కలిసి కిల్లర్ కాంబినేషన్‌లా పనిచేస్తాయి’ అని సోషల్ మీడియా వేదికగా ధోని పేర్కొన్నాడు. అలాగే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను నిజమైన ఛాంపియన్ బౌలరని, అతడి విజయాలను ఒకే పదంలో చెప్పడం సాధ్యం కాదని ధోని వ్యాఖ్యానించాడు.


‘టీ20 మ్యాచ్‌లో 25 నుంచి 30 పరుగుల తేడాతో గెలిస్తేనే పెద్ద విజయంగా భావిస్తాం. కానీ 96 పరుగుల తేడా అంటే అది అద్భుతమైన ఆధిపత్యం’ అని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా టీమిండియాను అభినందించాడు. ‘టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా, మూడు సార్లు టైటిల్ అందుకున్న టీమ్‌గా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి భారత ఆటగాళ్లు పూర్తిగా అర్హులు. గొప్ప ప్రదర్శనలతో టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో ఒక బ్రాండ్‌గా నిలిచింది’ అని సచిన్ పేర్కొన్నారు.


టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమిండియా విజయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘భారత జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. అందరికీ అభినందనలు’ అంటూ రాసుకొచ్చాడు. ‘మరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచాం. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో అద్భుతమైన విజయం సాధించాం. టోర్నమెంట్ అంతా ఒత్తిడిలో ఉన్నా ఆటగాళ్లు తమ స్థాయిని చూపించారు. సంజు అద్భుతంగా ఆడాడు. ఇంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్న జట్టుకు పోటీ ఇవ్వడం కష్టం. ఈ ఘనతలో భాగమైన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ అభినందనలు’ అని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తెలిపాడు.


మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఒత్తిడి? అది ఏమిటో తెలియనట్టు మన ప్లేయర్లు ఆదివారం గల్లీ క్రికెట్ ఆడినంత సులువుగా మ్యాచ్ ముగించారు. మరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. టీ20 ప్రపంచకప్‌లో మూడోసారి భారత్ విజేతగా నిలవడం గొప్ప విషయం’ అని వ్యాఖ్యానించాడు.‘నమ్మకం, జట్టు స్పూర్తి, కృషి కలిసి ఈ విజయాన్ని తీసుకొచ్చాయి. కీలక సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ప్రత్యేకం. ఇలాంటి విజయాలు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లకు పెద్ద కలలు కనడానికి ప్రేరణ ఇస్తాయి’ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంట్నర్

Updated Date - Mar 09 , 2026 | 02:09 PM