Share News

న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. కంకషన్‌కు గురైన స్టార్ ప్లేయర్

ABN , Publish Date - Nov 03 , 2026 | 02:53 PM

ఇటీవలే న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో సత్తా చాటి.. ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో కివీస్ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

న్యూజిలాండ్‌కు బిగ్ షాక్..  కంకషన్‌కు గురైన స్టార్ ప్లేయర్
Devon Conway Injury

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవలే న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో సత్తా చాటి.. ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో కివీస్ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తొలి వన్డేకు దూరమయ్యాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఇవాళ(మంగళవారం) న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సమయంలో ఒక క్యాచ్ అందుకునే క్రమంలో కాన్వే, ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ పరస్పరం బలంగా ఢీకొన్నారు.


ఈ ప్రమాదంలో కాన్వే తలకి తీవ్రమైన దెబ్బ తగలడంతో వైద్య బృందం వెంటనే అతడికి పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆసుపత్రికి తరలించి స్కాన్ చేయగా అతడు కంకషన్‌కు (తలకు గాయం) గురైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో రేపు జరగనున్న వన్డే మ్యాచ్‌కు కాన్వే దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇటీవల న్యూజిలాండ్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ , విలియం రూర్టిర్కీ, బెన్ సియర్స్ వంటి కీలక ఆటగాళ్లు వివిధ గాయాలతో వన్డే సిరీస్‌కు దూరమవ్వగా, తాజాగా కాన్వే కూడా కంకషన్‌కు గురయ్యాడు. ఈ ఏడాది జన‌వ‌రిలో భార‌త్‌లో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో కాన్వే పాల్గొన్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో వ‌న్డే మ్యాచ్ కాన్వే ఆడ‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు 43 వ‌న్డేలు ఆడిన కాన్వే 1692 ప‌రుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, ఆరు అర్థ‌ శతకాలున్నాయి.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్: భారత్-పాక్ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా 84 లక్షల దరఖాస్తులు!

యశస్వి 155 పరుగులు.. న్యూజిలాండ్‌తో టెస్టులకు అవకాశం దక్కుతుందా?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై గిల్ క్లారిటీ

Updated Date - Nov 03 , 2026 | 03:26 PM