క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకంటే!
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:13 PM
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ 2026-27లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఏ తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ మండిపడుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఫ్యాన్స్, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ సీఏ తీసుకున్న నిర్ణయం ఏమిటి, అభిమానులు అంతలా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశీ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. బీబీఎల్ జట్టు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు ఇవాళ(మంగళవారం) సీఏ ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా నుంచి ప్రకటన విడుదల కావడమే ఆలస్యం పలువురు ప్రముఖులు రంగంలోకి దిగారు. ఐపీఎల్లోని పలు ఫ్రాంఛైజీల యజమానులు బీబీఎల్‌లోనూ జట్లను సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ వంటి పలు విదేశీ లీగ్‌లలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఓనర్లు ఉన్నారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనతో బీబీఎల్‌లోనూ తమ వాటాను విస్తరించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని స్వాగతించాడు. ప్రైవేటీకరణ ద్వారా క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని, దీని ద్వారా బీబీఎల్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరతాయని వెల్లడించాడు. ఆసీస్ కెప్టెన్‌గా తనకు టెస్టు క్రికెట్ అత్యంత ముఖ్యమని కమిన్స్ పేర్కొన్నాడు. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బీబీఎల్ నాశనమవుతుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
'షుగర్ డాడీని కూడా చంపేస్తా'.. గువాహటి ఘటన నిందితుడి కీలక వ్యాఖ్యలు
యూఎస్ ఓపెన్2026లో ముగిసిన నవోమి ఒసాకా ప్రయాణం