క్లోయ్ ట్రయాన్ విధ్వంసం..16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. !
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:48 PM
ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ 2026 సీజన్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ టోర్నీ చరిత్రలో నిలిచిపోయే ఓ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) 2026 సీజన్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ టోర్నీలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్లోయ్.. ఇవాళ(శనివారం) మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో చెలరేగింది. ఈ విజయంతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 8.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ముందు 8 ఓవర్లలో 100 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించబడింది.
అనంతరం లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన క్లోయ్ ట్రయాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు సాధించింది. మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది. ఈ క్రమంలో కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ట్రయాన్.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. 2022లో టెస్ ఫ్లింటాఫ్ కూడా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. కాగా, ఈ జాబితాలో లారా హారిస్ (15 బంతులు) తొలిస్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
విశాఖలో బస్సు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం: హోంమంత్రి అనిత