ఐపీఎల్ జట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:30 AM
ఐపీఎల్ జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచుతారనే ప్రచారాన్ని బీసీసీఐ ఖండించింది. అసలు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచుతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందు లీగ్‌ను 12 జట్లకు విస్తరిస్తారని, ఇందుకోసం పుణె, వడోదర నగరాలను పరిశీలిస్తున్నట్లు గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖండించింది. అసలు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.... ఐపీఎల్ జట్లను పెంచుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ విషయంపై తాము అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ చర్చించలేదని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో ఐపీఎల్‌కు భారీగా ఆదరణ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి లీగ్ విస్తరణకు ఎలాంటి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్ 2027 సీజన్ నిర్వహణపైనే ఉందని సైకియా వెల్లడించారు. ఈసారి ఐపీఎల్‌కు చాలా ప్రత్యేకత ఉందని, ఇది 20వ సీజన్ కాబట్టి అత్యంత ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నామని సైకియా వెల్లడించారు. ప్రస్తుతానికి 2027 సీజన్ ఏర్పాట్లు గురించి తప్ప మరే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యమని ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్ జట్ల పర్స్ విలువను రూ.125 కోట్ల నుంచి 150 కోట్లకు పెంచే విషయంపై కూడా సైకియా స్పందించారు. 'ప్రస్తుతం ఫ్రాంచైజీల పర్స్ విలువను పెంచడం లేదు. డిసెంబర్ 16న ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. ప్రస్తుత సైకిల్లో ఇదే చివరి సీజన్. 2028లో మెగా వేలం జరగనుంది. ఈ వేలానికి ముదే ఫ్రాంచైజీల పర్స్ మనీని పెంచే విషయంపై నిర్ణయం తీసుకుంటాం' అని సైకియా తెలిపారు. ఐపీఎల్ విండోను మే నుంచి జనవరికి మార్చాలనే డిమాండ్లపై మాట్లాడేందుకు సైకియా నిరాకరించారు. మొత్తంగా సైకియా వివరణతో ఐపీఎల్ విస్తరణపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
ఇవి కూడా చదవండి..
ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్
జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..