క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపై మౌనం వీడిన అనయ బంగర్
ABN , Publish Date - Aug 27 , 2026 | 10:34 AM
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంకర్ కూతురు అనయా బంకర్‌కు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్‌కు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఆసీస్ గడ్డపై 2027 మార్చి నుంచి జరిగే ఎలైట్ మహిళా క్రికెట్‌లో పాల్గొనేందుకు ఆమెకు అర్హత లభించింది. సీఏ నిర్ణయంపై అనయ స్పందించింది.
'మార్చి 2027 నుంచి డబ్ల్యూబీబీఎల్‌లో ఆడేందుకు అర్హత సాధించడం చాలా భావోద్వేగ క్షణం. ఎందుకంటే ఒక దశలో క్రికెట్ నుంచి శాశ్వతంగా దూరమయ్యానని భావించాను' అని తెలిపింది. ప్రస్తుతానికి సీఏ ఇచ్చిన ఈ అనుమతి తొలి అడుగు మాత్రమేనని, ముందుగా తన ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించడంపైనే పూర్తి దృష్టి పెడతానని అనయ వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆసీస్ గడ్డపై అనయా తన క్రికెట్ ప్రయాణాన్ని పునఃప్రారంభించనుంది.
అనయ క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అర్హత సాధించింది. ఎలైట్ మహిళా కేటగిరీలో ఆడాలంటే కనీసం 12 నెలల పాటు సీరమ్ టెస్టోస్టెరాన్ సాంద్రతను 10 నానోమోల్స్ కంటే తక్కువగా నిర్వహించాల్సి ఉంటుంది. అనయ సమర్పించిన వైద్య నిపుణుల సమాచారాన్ని పరిశీలించిన సీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. సీఏ నిర్ణయంతో అనయా ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రంలోనైనా జరిగే ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, మహిళా బిగ్ బాష్ లీగ్ (WBBL) లో ఆడేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో పురుషుల ప్యూబర్టీని దాటిన ట్రాన్స్‌జెండర్ మహిళలను అనుమతించనప్పటికీ, క్రికెట్ ఆస్ట్రేలియా దేశవాళీ పాలసీ నిబంధనలు విభిన్నంగా ఉండటం గమనార్హం.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్, కశ్మీరా దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి అబ్బాయి పేరు అథర్వ, రెండో కుమారుడి పేరు అర్యన్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆర్యన్ అండర్ -16, అండర్ -19 విభాగాల్లో క్రికెట్ ఆడాడు. ఆర్యన్ కు ప్రముఖ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి ఆడిన అనుభవం ఉంది. అయితే, జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆర్యన్ కాస్త అనయగా మారి.. తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.
ఇవి కూడా చదవండి:
నోబాల్స్ తగ్గాలంటే.. టెస్టుల్లో ఫ్రీ హిట్ పెట్టాలి: టీమిండియా కోచ్