నేపాల్‌లో వరద బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మాయం.. భయానకంగా ఏరియల్ దృశ్యాలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:45 AM
నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భోటే కోషి, త్రిశూలి నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భోటే కోషి, త్రిశూలి నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా తీసిన ఏరియల్ వీడియోల్లో వరద విధ్వంసం భయానకంగా కనిపిస్తోంది (Nepal flash floods).
ఇళ్లు, మార్కెట్లతో కళకళలాడిన ప్రాంతాలు వరద తర్వాత బురద, శిథిలాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వరద ఉద్ధృతికి అనేక ప్రాంతాల్లో ఇళ్ల కింది అంతస్తులు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కూడా కష్టంగా మారింది. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ప్రతినిధి డేవిడ్ ఫిషర్ మాట్లాడుతూ.. మొత్తం గ్రామాలు, మార్కెట్ ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు (Nepal flood aerial video).
నేపాల్ అధికారుల తాజా సమాచారం ప్రకారం 162 మంది మరణించారు. 403 మంది గల్లంతయ్యారు (Nepal flood devastation). గల్లంతైన వారిలో 142 మంది భారతీయులు ఉన్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికాకు చెందినవారు కూడా ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.
కాగా, విపత్తు ఇంకా పూర్తిగా ముగియలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్-చైనా సరిహద్దులోని నదిలో ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న బ్లాకేజీ ఇంకా ఉందని, దాని కారణంగా మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..