Share News

150 మందిపై యూపీ ఏటీఎస్ నజర్.. పాక్ టెర్రర్ నెట్‌వర్క్‌తో లింకులపై దర్యాప్తు..

ABN , Publish Date - Aug 27 , 2026 | 10:28 AM

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత నాలుగు నెలల్లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన 52 మంది అనుమానితులను ఏటీఎస్ అరెస్టు చేసింది. వారిని విచారించగా మరో 150 మందికి పైగా అనుమానితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

150 మందిపై యూపీ ఏటీఎస్ నజర్.. పాక్ టెర్రర్ నెట్‌వర్క్‌తో లింకులపై దర్యాప్తు..
UP ATS

లక్నో: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. గత నాలుగు నెలల్లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన 52 మంది అనుమానితులను ఏటీఎస్ అరెస్టు చేసింది. వారిని విచారించగా మరో 150 మందికి పైగా అనుమానితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వారి పరిచయాలు, కార్యకలాపాలకు సంబంధించిన కీలక అంశాలను ఏటీఎస్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.


ఇప్పటికే గుర్తించిన అనుమానితుల్లో 60 మందికి పైగా వ్యక్తులను విచారించినట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. వారి సోషల్ మీడియా ఖాతాలు, చాటింగ్ వివరాలు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ నెట్‌వర్క్‌లను పరిశీలించినట్లు చెప్పారు. అరెస్టయిన 52 మంది నిందితులతో సోషల్ మీడియా ద్వారా సంబంధాలు కొనసాగించిన మరో 20 మందినీ ఏటీఎస్ గుర్తించిందని.. వారి పైనా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అయితే వారందరికీ ఉగ్ర నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఏటీఎస్ భావించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, 52 మంది నిందితులతో వీరికి కేవలం పరిచయం లేదా సోషల్ మీడియా సంబంధం మాత్రమే ఉందా?, లేక పాకిస్థాన్‌కు చెందిన నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్నారా? అన్న అంశంపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు.


అరెస్టయిన 52 మంది నిందితులు పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టి, అతడి నెట్‌వర్క్‌కు స్లీపర్ సెల్స్‌‌గా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీరిపై దహనకాండ ద్వారా బీభత్సం సృష్టించడం, పేలుళ్లకు కుట్ర పన్నడం, పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లకు అనుకూలంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా అనుమానితులందరి సోషల్ మీడియా సంభాషణలు, ఇతర డిజిటల్ కార్యకలాపాలను ఏటీఎస్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. అదేవిధంగా వారి బ్యాంకు లావాదేవీలపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా?, నిధుల బదిలీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

రష్యాలోని ఏజీసీసీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురి మృతి, 152 మందికి గాయాలు..

నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 50మందికి పైగా చిక్కుకున్న తమిళనాడు యాత్రికులు

Updated Date - Aug 27 , 2026 | 11:16 AM