Share News

టీ20ల్లో కనోర్‌ కరోల్ సరికొత్త ప్రపంచ రికార్డు

ABN , Publish Date - May 22 , 2026 | 11:11 AM

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. క్రొయేషియాకు చెందిన 23 ఏళ్ల ఆల్‌రౌండర్‌ కనోర్‌ కరోల్‌ పేరు పొట్టి క్రికెట్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కరోల్‌ నిలిచాడు.

టీ20ల్లో కనోర్‌ కరోల్  సరికొత్త ప్రపంచ రికార్డు
Connor Carroll T20 record

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ టీ20ల్లో తరచూ ఏదో ఒక రికార్డు నమోదవుతూ ఉంటుంది. తాజాగా క్రొయేషియా ఆల్‌రౌండర్‌ కనోర్‌ కరోల్‌ ఓ సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా 23 ఏళ్ల కరోల్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ వరల్డ్ రికార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


టీ20 ప్రపంచకప్‌-2028 రీజినల్‌ యూరోప్‌ క్వాలిఫయర్‌-‘ఎ’లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో ఫ్రాన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా క్రొయేషియా తరఫున కనోర్‌ కరోల్ (Connor Carroll) అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ ఎడమ చేతి బ్యాటర్‌ 34 బంతుల్లో 71 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఈ మ్యాచ్‌లో క్రొయేషియా ఓడిపోయింది. తన రెండో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై కరోల్‌ భారీ శతకంతో చెలరేగి ఆడాడు. కేవలం 72 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. ఇందులో 10 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి.


కరోల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా క్రొయేషియా 199 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన స్విట్జర్లాండ్‌ క్రొయేషియా చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన కరోల్‌ ఈ మ్యాచ్‌ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ వికెట్‌ కూడా సాధించాడు. తాజాగా తన మూడో మ్యాచ్‌లో భాగంగా జెర్సీ జట్టుపై 74 పరుగులు సాధించాడు. జెర్సీ చేతిలో క్రొయేషియా ఓడినప్పటికీ కరోల్ మాత్రం ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.


ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో కలిపి అత్యధికంగా 295 పరుగులు (సగటు 147.50, స్ట్రైక్‌రేటు 215.32) రాబట్టిన క్రికెటర్‌గా కరోల్ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెక్‌కియోన్‌ పేరిట ఉండేది. అతడు తన దేశం తరఫున తొలి మూడు టీ20ల్లో కలిపి 286 పరుగులు సాధించాడు. తాజాగా కనోర్‌ కరోల్‌ గుస్తావ్‌ను అధిగమించాడు. కరోల్ గత రెండేళ్లుగా ఆస్ట్రేలియన్ గ్రేడ్ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇటీవలే ఫిబ్రవరి 2026లో అతను సౌత్ ఆస్ట్రేలియా సెకండ్ XI తరపున కూడా ఆడాడు.


ఇవి కూడా చదవండి..

విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 11:19 AM