ఇక ‘మర్యాద’గా లోన్ రికవరీ
ABN , Publish Date - May 22 , 2026 | 03:51 AM
అవసరం కోసం బ్యాంకులో లోన్ తీసుకొని ఏవైనా ఇబ్బందుల వల్ల సకాలంలో తిరిగి చెల్లించకపోతే.. ఆ బ్యాంకు రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు చెప్పనలవి కాదు.
ఏజెంట్లు దుర్భాషలాడడం, వేధించడం కుదరదు
ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకే కస్టమర్లకు ఫోన్ చేయాలి.. మిత్రులు, బంధువులకు ఫోన్లు చేయరాదు
వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌మీడియాలో పెట్టడం నేరం
రికవరీ ఏజెన్సీలకు ఐఐబీఎఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి
ఏజెన్సీల వివరాలను బ్యాంకులు తమ సైట్లలో చూపాలి
లోన్‌లో ఫోన్ కొని డిఫాల్ట్ అయితే ఆ ఫోన్‌ను బ్యాంకులు పూర్తిగా బ్లాక్ చేయరాదు.. ఆర్బీఐ కఠిన నిబంధనలు
ఈ నెల 31 దాకా చట్ట సవరణ ముసాయిదాపై అభిప్రాయాలు తెలపాలి.. అక్టోబరు 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, మే 21: అవసరం కోసం బ్యాంకులో లోన్ తీసుకొని ఏవైనా ఇబ్బందుల వల్ల సకాలంలో తిరిగి చెల్లించకపోతే.. ఆ బ్యాంకు రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు చెప్పనలవి కాదు. గంటగంటకు ఫోన్ చేయటం, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటం, బెదిరించటం ఒక్కటేమిటి.. వినియోగదారుడికి నరకం చూపిస్తారు. బ్యాంకుల ఉద్యోగులు కూడా వేధింపులకు పాల్పడతారు. ఇదేమిటని అడిగితే.. ఏజెంట్లు తమ ఉద్యోగులు కా దని బ్యాంకులు తప్పించుకుంటున్నాయి. ఈ వేధింపులన్నింటికీ చెక్ పెట్టేలా ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు తేబోతోంది. ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకులు-బాధ్యతాయుత వ్యాపార నియమావళి) సవరణ మార్గదర్శకాలు- 2026’ పేరుతో ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాపై ఈ నెల 31వ తేదీ వరకు ప్రజల అభిప్రాయం కోరింది. ఈ సవరణ చట్టం వచ్చే అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇందులో ‘లోన్‌రికవరీ ఏజెన్సీలు, ఏజెంట్లు’ అనే పదాలకు ఆర్బీఐ స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. వీరికి కచ్చితమైన అర్హతలను, విధి నిర్వహణ నియమావళినీ నిర్దేశించింది. ఏజెంట్లు చేసే తప్పులకు బ్యాంకులు బాధ్యత వహించేలా నిబంధనలు పొం దుపర్చింది. కస్టమర్ల రక్షణకు పటిష్ఠమైన చర్యలను ప్రతిపాదించింది.
ముసాయిదాలోని కీలక అంశాలు:
లోన్ రికవరీ కార్యకలాపాల్లో పాల్గొనే ఔట్‌సోర్సింగ్ సంస్థలు, వ్యక్తుల (బిజినెస్ కరెస్పాండెంట్లు)ను ‘రికవరీ ఏజెన్సీలు’ అంటారు.
లోన్ రికవరీ కోసం కస్టమర్‌తో నేరుగా మాట్లాడే వ్యక్తిని ‘రికవరీ ఏజెంటు’ అంటారు.
రికవరీ ఏజెన్సీలు, ఏజెంట్లుగా ఎవరిని పడితే వారిని నియమించటానికి వీలులేదు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) సర్టిఫికేట్ లేదా తత్సమాన అర్హత పత్రం ఉన్నవారినే రికవరీ ఏజెంట్లుగా, ఏజెన్సీలుగా బ్యాంకులు నియమించుకోవాలి.
వీరి విధి నిర్వహణపై కచ్చితమైన నియమావళి ఉండాలి. ఆ నియమావళికి ఈ ఏజెన్సీలు, ఏజెంట్లు కట్టుబడి ఉండాలి.
తమ సంస్థ తరఫున ఏయే సంస్థలను రికవరీ ఏజెన్సీలుగా నియమించామనే వివరాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో పెట్టాలి. మధ్యలో ఏజెన్సీని మార్చితే వెంటనే అప్‌డేట్ చేయాలి.
ఏజెంట్లు లోన్ రికవరీకి వచ్చే విషయాన్ని కస్టమర్‌కు ఒకరోజు ముందే బ్యాంకులు తెలియజేయాలి. రికవరీ ఏజెంటు గుర్తింపు కార్డును, లోన్ రికవరీ అనుమతి పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి.
విజిటింగ్ షెడ్యూల్ ఖరారైన తర్వాత రికవరీ ఏ జెంటు ఏదైనా కారణంతో రాలేకపోతే.. బ్యాంకు ఆ విషయాన్ని కస్టమర్‌కు వెంటనే తెలపాలి.
కస్టమర్‌ను లేదా గ్యారంటీగా ఉన్న వ్యక్తిని తరచూ ఫోన్లు చేసి వేధించరాదు.
ఉదయం 8గంటల నుంచి రాత్రి 7గంటల లోపు మాత్రమే ఏజెంట్లు కస్టమర్‌ను సంప్రదించాలి.
కస్టమర్‌తో మర్యాదగా ప్రవర్తించాలి. కస్టమర్ పరువుకు భంగం కలిగే పనులు చేయకూడదు. దుర్భాషలాడటం, వేధించటం నిషిద్ధం.
లోన్ కట్టకపోతే కస్టమర్ స్నేహితులు, బంధువులకు ఏజెంట్లు ఫోన్లు చేసి ఆ విషయం చెప్పకూడదు. చెప్తామని కస్టమర్‌ను బెదిరించకూడదు. వివాహాల వంటి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వెళ్లి వేధించకూడదు.
కస్టమర్ ఫోన్ నంబర్, లోన్ వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో బ్యాంకులు, ఏజెంట్లు బహిర్గతం చేయరాదు.
బ్యాంకు ఉద్యోగులు, ఏజెంట్లు కస్టమర్‌కు చేసే ఫోన్‌కాల్స్‌ను బ్యాంకులు కచ్చితంగా రికార్డు చేసి, ఆరు నెలలపాటు తప్పనిసరిగా భద్రపర్చాలి. ఏదైనా న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు ఈ రికార్డులు సాక్ష్యాలుగా ఉపయోగపడుతాయి. లోన్‌పై న్యాయ వివాదం కొనసాగుతున్నప్పుడు దాని రికవరీకి మొదట నియమించిన ఏజెన్సీని మార్చరాదు.
కస్టమర్ ఫోన్ డేటా వివరాలను బ్యాంకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సేకరించరాదు.
లోన్ తీసుకొని ఫోన్, ట్యాబ్ లాంటివి కొన్న కస్టమర్.. ఆ లోన్ కట్టలేకపోతే.. ఫోన్‌ను బ్యాంకులు పూర్తిగా బ్లాక్ చేయరాదు. ఇన్‌కమింగ్, ఎమర్జెన్సీ కాల్స్, ప్రభుత్వం జారీచేసేప్రజాప్రయోజన సందేశాలను, ఇంటర్నెట్‌ను బ్లాక్ చేయకూడదు.
ఒక్క ఈఎంఐ కట్టలేకపోయినంత మాత్రాన కస్టమర్ ఫోన్‌ను బ్లాక్ చేయకూడదు. 60 రోజులు గడిచిన తర్వాత మొదటి నోటీసు ఇవ్వాలి. ఆ త ర్వాత మరో 21 రోజులు సమయం ఇచ్చి రెండో నోటీసు ఇవ్వాలి. రెండో నోటీసు ఇచ్చిన 7 రోజుల తర్వాత కూడా కస్టమర్ లోన్ కట్టలేకపోతే అతడి ఫోన్‌ను పరిమితంగా బ్లాక్ చేయవచ్చు.
కస్టమర్ ఫోన్‌ను పరిమితంగా బ్లాక్ చేయాలన్నా.. ఆ లోన్ ఆ ఫోన్ కొనటానికి మాత్రమే తీసుకున్నదై ఉండాలి.
కస్టమర్ లోన్ డబ్బు చెల్లించిన తర్వాత కూడా బ్యాంకులు ఆ ఫోన్ సేవలను పునరుద్ధరించకపోతే.. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు బ్యాంకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.