Share News

చెన్నై ఢమాల్‌

ABN , Publish Date - May 22 , 2026 | 02:05 AM

ఐపీఎల్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవుట్‌ కాగా.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌-1 బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మిణుకుమిణుకుమంటున్న...

చెన్నై ఢమాల్‌

నేటి మ్యాచ్‌

సన్‌రైజర్స్‌ X బెంగళూరు

వేదిక : హైదరాబాద్‌, రా.7.30

ఐపీఎల్‌ నుంచి అవుట్‌

వెన్నువిరిచిన సిరాజ్‌, రషీద్‌

  • క్వాలిఫయర్‌-1కు గుజరాత్‌?

  • సుదర్శన్‌, గిల్‌, బట్లర్‌ అర్ధ శతకాలు

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవుట్‌ కాగా.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌-1 బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా నిలబట్టుకోవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెన్నై 89 పరుగుల తేడాతో గుజరాత్‌ చేతిలో చిత్తుగా ఓడింది. తొలుత టైటాన్స్‌ 20 ఓవర్లలో 229/4 స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), శుభ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64), బట్లర్‌ (27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 నాటౌట్‌) అర్ధ శతకాలు సాధించారు. ముకేశ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, అన్షుల్‌ కాంబోజ్‌ తలో వికెట్‌ దక్కించుకొన్నారు. ఛేదనలో చెన్నై 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. శివం దూబే (47), మాథ్యూ షార్ట్‌ (24) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సిరాజ్‌, రషీద్‌, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

పెవిలియన్‌కు క్యూ..

భారీ ఛేదనలో సిరాజ్‌ నిప్పులు చెరగడంతో.. పవర్‌ప్లేలోనే నాలుగు టాపార్డర్‌ వికెట్లు చేజార్చుకొన్న చెన్నై ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ శాంసన్‌ (0)ను డకౌట్‌ చేసిన సిరాజ్‌.. మూడో ఓవర్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (16), ఉర్విల్‌ పటేల్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. ఆరో ఓవర్‌లో షార్ట్‌ను రబాడ వెనక్కిపంపడంతో.. పవర్‌ప్లేను చెన్నై 58/4తో ముగించింది. కార్తీక్‌ శర్మ (19)ను గిల్‌ రనౌట్‌ చేశాడు. ఈ దశలో బ్రెవిస్‌ (8)తో కలసి దూబే ఆరో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 9వ ఓవర్‌లో అర్షద్‌ బౌలింగ్‌లో 6,4,4 బాదిన దూబే.. ఆ తర్వాతి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు. అయితే, ధాటిగా ఆడుతున్న దూబేను రషీద్‌ క్యాచవుట్‌ చేయడంతో.. చెన్నై పరాజయం ఖరారైంది. కాంబోజ్‌ (19), బ్రెవి్‌సను కూడా రషీద్‌ వెనక్కిపంపగా.. నూర్‌ (1), స్పెన్సర్‌ (0)ను అవుట్‌ చేసిన రబాడ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


టాప్‌ లేపారు..

టాపార్డర్‌ బ్యాటర్లు సుదర్శన్‌, గిల్‌, బట్లర్‌ దుమ్మురేపడంతో.. గుజరాత్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌కు ఓపెనర్లు సుదర్శన్‌, గిల్‌ శుభారంభాన్ని అందించారు. పసలేని చెన్నై బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న వీరిద్దరూ.. తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. పవర్‌ప్లేలో గిల్‌ బౌండ్రీలతో దూకుడు ప్రదర్శించగా.. సాయి చక్కని సహకారం అందించడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన గిల్‌.. ఆ తర్వాత మరో రెండు బౌండ్రీలతో జోరు చూపాడు. క్రమంగా సుదర్శన్‌ కూడా తన కెప్టెన్‌ను అనుసరించాడు. ఇక, ఆరో ఓవర్‌లో సాయి ఫోర్‌ కొట్టగా.. గిల్‌ తొలి సిక్స్‌ బాదడంతో గుజరాత్‌ 62/0తో నిలిచింది. మధ్య ఓవర్లలో కూడా వీరిద్దరూ ఇదే జోరును కొనసాగించడంతో.. చెన్నై బౌలర్లకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏడో ఓవర్‌లో నూర్‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టిన శుభ్‌మన్‌ 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. అనంతరం 6,4,4తో చెలరేగిన సాయి.. టీమ్‌ స్కోరును సెంచరీ మార్క్‌ దాటించాడు. ఈ క్రమంలో 12వ ఓవర్‌లో సింగిల్‌తో సుదర్శన్‌ కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో గిల్‌ను క్యాచవుట్‌ చేసిన స్పెన్సర్‌.. ఎట్టకేలకు జట్టుకు బ్రేక్‌ అందించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్‌, సుదర్శన్‌తో కలిసి ధాటిగా ఆడుతూ రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించడంతో.. స్కోరు వేగం ఎక్కడా తగ్గలేదు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి తరలించిన బట్లర్‌.. 14వ ఓవర్‌లో నూర్‌ బౌలింగ్‌ మరో రెండు సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టాడు. కానీ, 19వ ఓవర్‌లో కాంబోజ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన సుదర్శన్‌.. ఆ తర్వాతి బంతికి పెవిలియన్‌ చేరాడు. రాహుల్‌ తెవాటియా (0)ను రుతురాజ్‌ రనౌట్‌ చేసినా.. బట్లర్‌ రెండు వరుస బౌండ్రీలతో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. ఆఖరి ఓవర్‌లో బట్లర్‌, సుందర్‌ (7) 4,6 బాదడంతో.. గుజరాత్‌ స్కోరు 230కి చేరువైంది.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) షార్ట్‌ (బి) కాంబోజ్‌ 84, గిల్‌ (సి) దూబే (బి) స్పెన్సర్‌ 64, బట్లర్‌ (నాటౌట్‌) 57, తెవాటియా (రనౌట్‌/గైక్వాడ్‌) 0, సుందర్‌ (సి) ఉర్విల్‌ (బి) ముకేశ్‌ 7; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 229/4; వికెట్ల పతనం: 1-125, 2-207, 3-207, 4-229; బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-36-1, స్పెన్సర్‌ జాన్సన్‌ 4-0-47-1, గుర్జప్‌నీత్‌ సింగ్‌ 4-0-31-0, కాంబోజ్‌ 4-0-56-1, నూర్‌ 3-0-41-0, దూబే 1-0-15-0.

చెన్నై: శాంసన్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 0, షార్ట్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) రబాడ 24, గైక్వాడ్‌ (బి) సిరాజ్‌ 16, ఉర్విల్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) సిరాజ్‌ 0, కార్తీక్‌ (రనౌట్‌/గిల్‌) 19, బ్రెవిస్‌ (సి) హోల్డర్‌ (బి) రషీద్‌ 8, దూబే (సి) గిల్‌ (బి) రషీద్‌ 47, కాంబోజ్‌ (సి) హోల్డర్‌ (బి) రషీద్‌ 19, నూర్‌ (సి అండ్‌ బి) రబాడ 1, ముకేశ్‌ (నాటౌట్‌) 2, స్పెన్సర్‌ (సి) బట్లర్‌ (బి) రబాడ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 13.4 ఓవర్లలో 140 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-29, 3-29, 4-51, 5-63, 6-116, 7-136, 8-138, 9-140; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-26-3, రబాడ 3.4-0-32-3, అర్షద్‌ 2-0-24-0, హోల్డర్‌ 2-0-27-0, రషీద్‌ 2-0-18-3, ప్రసిద్ధ్‌ కృష్ణ 1-0-13-0.

1-Sports.jpg

ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 02:05 AM