Palestine Flag Controversy: హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన కశ్మీర్ క్రికెటర్
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:32 AM
జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పెద్ద వివాదం చెలరేగింది. ఓ క్రికెటర్ ధరించిన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ఉన్న గుర్తు వివాదాస్పదమైంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జమ్ము పోలీసులు విచారణ చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)లో జరిగిన ఓ మ్యాచ్‌లో క్రికెటర్ ధరించిన హెల్మెట్ వివాదాస్పదంగా మారింది. స్థానిక వ్యక్తి హెల్మెట్‌పై పాలస్తీనా జెండా ధరించి క్రికెట్ మ్యాచ్ ఆడాడు. జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ పేరిట జరుగుతున్న క్రికెట్ టోర్నీలో ఫుర్కాన్ భట్ అనే ఆటగాడు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడని తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. మ్యాచ్‌లో పాల్గొన్న ఫుర్కాన్‌తో పాటు టోర్నీ నిర్వాహకుడిని విచారణకు పిలిచారు. అంతేకాక వారికి సమన్లు జారీ చేశారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు ప్లేయర్ ధరించిన హెల్మెట్‌పై ముందుభాగంలో పాలస్తీనా జెండా స్టిక్కర్(Palestine flag controversy) ఉండటం కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ వివాదంపై జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ అధికారికంగా గుర్తింపు పొందింది కాదని స్పష్టం చేసింది. ఫుర్కాన్ అనే ఆటగాడి పేరు జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లేదా దాని అనుబంధ సంస్థల్లో ఎక్కడా నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఈ సంఘటన బుధవారం రోజున జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జేఎకే11 కింగ్స్, జమ్ము ట్రెయిల్ బ్లేజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పాలస్తీనా జెండా ఎలా, ఎలాంటి అనుమతులతో ప్రదర్శించారు అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు వ్యక్తి ఇలా చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి, టోర్నీ మార్గదర్శకాలను ఉల్లంఘించారా లేదా, అవసరమైన అనుమతులు తీసుకున్నారా అనే అంశాలపై పూర్తి స్థాయిలో పోలీసుల విచారణ(Jammu police investigation) కొనసాగుతోంది. ఈ టోర్నీ పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించారు. జాతీయ లేదా అంతర్జాతీయ క్రికెట్ సంస్థలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, భారత పౌరసత్వం కలిగిన ఏ వ్యక్తి అయినా పరాయి దేశ జెండాలను వాడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇదిలా ఉంటే, జమ్ము కశ్మీర్‌లో ఇటీవలికాలంలో అనధికారిక క్రికెట్ లీగ్‌లు ఎక్కువయ్యాయి.
ఇవి కూడ చదవండి:
jemimah Rodrigues: కొత్త సారథి అదృష్టం తెచ్చేనా?
Rishabh Pant: 3, 4 తేదీల్లో టీమిండియా ఎంపిక