Share News

Ashwin raises concerns: ప్రపంచ కప్‌ తర్వాత వన్డేలు ఉండవేమో ?

ABN , Publish Date - Jan 02 , 2026 | 05:52 AM

వన్డేల భవితవ్యంపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంజేశాడు. 2027 వరల్డ్‌ కప్‌ తర్వాత అసలు 50 ఓవర్ల ఫార్మాట్‌ జరగకపోవచ్చునేమోనని అన్నాడు..

Ashwin raises concerns: ప్రపంచ కప్‌ తర్వాత వన్డేలు ఉండవేమో ?

చెన్నై: వన్డేల భవితవ్యంపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంజేశాడు. 2027 వరల్డ్‌ కప్‌ తర్వాత అసలు 50 ఓవర్ల ఫార్మాట్‌ జరగకపోవచ్చునేమోనని అన్నాడు. అంతేకాదు భారత స్టార్‌ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్‌ ఆ మెగా టోర్నీ తర్వాత రిటైర్‌ అయితే వన్డేలపై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డాడు. టీ20 లీగ్‌ల ఆధిపత్యం, టెస్ట్‌ క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతుండడం వన్డేల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని వివరించాడు. ‘2027 ప్రపంచ కప్‌ అనంతరం వన్డేలు కొనసాగడం అనుమానంగానే ఉంద’ని ఓ యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో అశ్విన్‌ చెప్పాడు.

వరుస పెట్టి ప్రపంచ కప్‌లా?

ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న వరల్డ్‌ కప్‌ల వల్ల కూడా వన్డేలపై ఫ్యాన్స్‌కు ఆసక్తి తగ్గిపోతోందని అశ్విన్‌ పేర్కొన్నాడు. ‘ఆదాయం కోసం ప్రతి ఏటా వరల్డ్‌ కప్‌లను షెడ్యూల్‌ చేస్తున్నారు. 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగింది. మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ను నిర్వహించారు. 2026లో పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లు జరుగుతున్నాయి. కానీ ఫిఫాను చూడండి. ప్రపంచ కప్‌ను నాలుగేళ్లకోసారి జరుపుతోంది. అందుకే ఫిఫా వరల్డ్‌ కప్‌నకు అంత ప్రత్యేకత ఉంటోంది. కానీ క్రికెట్‌లో ఎన్నో ద్వైపాక్షిక సిరీ్‌సలు, ఎన్నో ఫార్మాట్‌లు, లెక్కలేనని ప్రపంచ కప్‌లు. ఇవన్నీ ఆటపై అభిమానుల ఆసక్తిని చంపేస్తున్నాయి’ అని అశ్విన్‌ వివరించాడు.

Updated Date - Jan 02 , 2026 | 05:52 AM