Share News

కామన్వెల్త్ గేమ్స్: భారత జుడో జట్టుకు షాక్.. గ్లాస్గోకు చేరని ప్లేయర్ల సామగ్రి!

ABN , Publish Date - Jul 29 , 2026 | 09:25 PM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాల్గొనే ముందు భారత జుడో జట్టుకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. భారత్ నుంచి గ్లాస్గోకు చేరుకున్న 16 మంది సభ్యుల జట్టులో పలువురు జుడోకాలకు చెందిన లగేజీ గమ్యస్థానానికి చేరకపోవడంతో ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది.

కామన్వెల్త్ గేమ్స్: భారత జుడో జట్టుకు షాక్.. గ్లాస్గోకు చేరని ప్లేయర్ల సామగ్రి!
Indian Judo Team

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాల్గొనే ముందు భారత జుడో జట్టుకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. భారత్ నుంచి గ్లాస్గోకు చేరుకున్న 16 మంది సభ్యుల జట్టులో పలువురు జుడోకాలకు చెందిన లగేజీ గమ్యస్థానానికి చేరకపోవడంతో ప్రాక్టీస్‌కు అంతరాయం ఏర్పడింది. జులై 31 నుంచి జుడో పోటీలు ప్రారంభం కానుండటంతో ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. లగేజీలో జుడోగీలు (జూడో పోటీల్లో ధరించే ప్రత్యేక దుస్తులు), శిక్షణకు అవసరమైన ఇతర సామగ్రి ఉన్నట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లు సాధనను పూర్తి స్థాయిలో కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. పోటీలకు ఇంకా ఒక్కరోజే సమయం ఉండటంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.


ఈ విషయాన్ని గుర్తించిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెంటనే స్పందించింది. సంబంధిత అధికారులు, విమానయాన సంస్థతో సంప్రదింపులు జరిపి లగేజీని వీలైనంత త్వరగా ఆటగాళ్లకు అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, ఇటీవల భారత బాక్సింగ్ జట్టుకూ ఇలాంటి సమస్యే ఎదురైంది. బెల్‌ఫాస్ట్‌లో శిక్షణ శిబిరం ముగించుకుని గ్లాస్గోకు చేరుకున్న బాక్సర్ల లగేజీ కూడా ఆలస్యంగా చేరడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.


వరుసగా బాక్సింగ్, జుడో జట్లకు లగేజీ సమస్యలు తలెత్తడం భారత బృందం ఎదుర్కొంటున్న నిర్వహణపరమైన సవాళ్లపై ఆందోళన కలిగిస్తోంది. పోటీలు ప్రారంభమయ్యేలోపు సామగ్రి అందితేనే ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్‌ 2027: స్క్వాడ్ సైజ్‌ను పెంచండి.. ఐసీసీకి ఆసీస్ కోచ్ విజ్ఞప్తి

ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో సంచలనం.. అసలేంటీ ‘క్లికీ పాంటింగ్’ వివాదం?

Updated Date - Jul 29 , 2026 | 09:36 PM