బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి రెండు టీ20 జట్లు!
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:41 PM
భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా పోటీ నడుస్తూన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి రెండు టీ20 జట్లను సిద్ధం చేసే దిశగా సాగుతున్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా పోటీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. యువ ప్లేయర్లు అందరూ తమ ప్రతిభను నిరూపించుకుంటూ టీమిండియాలో స్థానం కోసం శ్రమిస్తున్నారు. దానికి ఫ్రాంచైజీ క్రికెట్ ఒక ఫ్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది. టాప్ ప్లేయర్లు మాత్రమే కాకుండా దేశవాళీల్లో, ఐపీఎల్‌లో సత్తా చాటుతోన్న యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం బీసీసీఐకు పెద్ద సవాలుతో కూడుకున్న పనే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతిభ కలిగిన ప్రతి ప్లేయర్‌కు అవకాశం ఇచ్చే దిశగా నడుస్తోన్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
భారత జట్టులోకి రావడానికి అందుబాటులో ఉన్న ప్లేయర్ల సంఖ్య ఆధారంగా కనీసం 30 నుంచి 35 మందితో బీసీసీఐ ఓ జాబితాను సిద్ధం చేయనుంది. ఒకేసారి రెండు జట్లు బరిలోకి దిగేలా ప్రణాళికలను రచిస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న సిరీస్‌ల దృష్ట్యా దీనిని వర్కౌట్ చేసేందుకు కార్యాచరణను మొదలుపెట్టినట్టు సమాచారం. అందుకు ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్ వేదికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. అటు కెప్టెన్సీ పరంగానూ అదరగొడుతున్నాడు. అయ్యర్‌కు ఓ జట్టు బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. రెండో జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ లేదా మరెవరైనా ఉండొచ్చు.
‘ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్ దాదాపు ఒకే సమయంలో రానున్నాయి. అందుకే రెండు టీమ్‌లను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాం. దానికోసం 30 నుంచి 35 మందితో కూడిన జాబితా రెడీ అవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ఈ లిస్ట్‌లో నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న యువ ప్లేయర్లకు ఇది సదావకాశం. రెండు టీమ్‌లూ బలంగా ఉండాలనే లక్ష్యంతో బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది’ అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్