BCB Controversy: పంతం నెగ్గించుకున్న బంగ్లా క్రికెటర్లు.. కీలక అధికారి తొలగింపు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:36 AM
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఆర్థిక సంఘ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం బంగ్లా ప్లేయర్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన ప్లేయర్లు.. నజ్ముల్‌ను బోర్డు నుంచి తొలగించకపోతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్), అంతర్జాతీయ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వారి డిమాండ్స్ కు తలొగ్గిన బీసీబీ.. నజ్ముల్ ను తొలగించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్‌లో రాజకీయ సంక్షోభం నెలకున్న సంగతి తెలిసిందే. బీసీబీ (BCB) డైరెక్టర్, ఆర్థిక సంఘ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం బంగ్లా ప్లేయర్లపై అవమానకరమైన వ్యాఖ్యలు(BCB Controversy) చేశారు. దీంతో అతడికి వ్యతిరేకంగా బంగ్లా ప్లేయర్లు తమ నిరసన తెలిపారు. నజ్ముల్‌ను బోర్డు నుంచి తొలగించకపోతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్), అంతర్జాతీయ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని బంగ్లాదేశ్ క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బీసీబీకి వార్నింగ్ ఇచ్చింది.
ఈ క్రమంలో బీసీబీ నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగించకుండా.. కేవలం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినా, బంగ్లా ఆటగాళ్లు వెనక్కి తగ్గలేదు. గురువారం బీపీఎల్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ప్లేయర్లు(BPL boycott) మైదానంలోకి రాలేదు. దీంతో వివాదం మరింత ముదురుతోందని గ్రహించిన బీసీబీ.. నజ్ముల్‌ను బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లను వాయిదా చేశారు.
నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు ఇవే:
బుధవారం నజ్ముల్(Najmul Islam comments) మీడియాతో మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఆడే విషయంపై పలు వ్యాఖ్యలు చేశారు. '2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడకపోతే బంగ్లా క్రికెట్ బోర్డుకు ఎలాంటి నష్టం ఉండదు. ఆటగాళ్లకు మాత్రమే నష్టం జరుగుతుంది. వారు ప్రపంచ కప్‌లో ఆడకపోతే ఎలాంటి పరిహారం ఉండదు. అలానే కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నా బంగ్లా ప్లేయర్లు అంతర్జాతీయ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. వాళ్లు ఆడలేకపోయిన ప్రతిసారీ డబ్బులు తిరిగి అడుగుదాం’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెటర్లు సీరియస్ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా తమ నిరసనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్
కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి