Share News

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:43 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వివాదం వేళ ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని మొదలు పెట్టిందే బీసీసీఐ అని ఆరోపించాడు.

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Basit Ali

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వివాదం వేళ ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌ను ఈ టోర్నీ నుంచి తప్పించడంతో దానికి మద్దతుగా పాక్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ మాట వినకపోతే పీసీబీపై నిషేధం పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాసిత్ అలీ(Basit Ali) ఈ వార్తలపై స్పందించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.


‘భారత జట్టే ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టింది. పాకిస్థాన్ వేదికగా ఐసీసీ(ICC) ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని అప్పట్లో బీసీసీఐ చెప్పింది. ఇప్పుడు మా ప్రభుత్వం భారత్‌తో ఆడొద్దని చెబుతోంది. భారత ప్రభుత్వం మాట బీసీసీఐ(BCCI) విన్నప్పుడు.. పాక్ ప్రభుత్వం మాట పీసీబీ వినకూడదా? వాళ్లు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా. 1996 ప్రపంచ కప్‌లో భద్రతా కారణాల వల్ల ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్లు శ్రీలంకతో ఆడటానికి నిరాకరించాయి. 2003 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కొన్ని మ్యాచులను బహిష్కరించాయి. ఆ సమయంలో ఆ జట్ల పాయింట్లలో మాత్రమే కోత విధించారు. ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ జట్టుపై నిషేధం విధిస్తామని హెచ్చరిస్తున్నారు. మీకు దమ్ముంటే ఉంటే పాక్‌పై నిషేధం విధించండి. ఐసీసీ ఇప్పుడు పీసీబీ నుంచి లిఖిత పూర్వక వివరణ అడుగుతోంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పాకిస్థాన్‌కు రాబోమని ఐసీసీకి బీసీసీఐ లిఖిత పూర్వక హామీ ఇచ్చిందా? భారత క్రికెట్ బోర్డును అడగని ప్రశ్నను పీసీబీ(PCB)ని ఎందుకు అడుగుతున్నారు?’ అని బాసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానం అభిషేక్ శర్మదే

భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - Feb 04 , 2026 | 03:44 PM