Share News

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:53 PM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్
Babar Azam

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్ బుధవారం ప్రారంభం కానుండగా.. కీలకమైన మ్యాచ్‌లో ఆజమ్ లేకపోవడం పాక్‌కు పెద్ద లోటుగా మారింది. అతడి స్థానంలో పాక్‌కు సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బాబర్ కుడి చేతి మధ్య వేలికి గాయం కావడంతో హెడ్డింగ్లీ టెస్టుకు అందుబాటులో ఉండడని పాకిస్థాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు.


రెండో టెస్టుకు అందుబాటులోకి వస్తాడా?

ప్రస్తుతం బాబర్ గాయం తీవ్రతపై వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ లేదని కోచ్ సర్ఫరాజ్ స్పష్టం చేశాడు. అయితే నొప్పి ఎక్కువగా ఉందని తెలిపాడు. రెండో టెస్టుకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండటంతో.. అప్పటికి బాబర్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు సర్ఫరాజ్ పేర్కొన్నాడు. దీంతో అతడు మొత్తం సిరీస్‌కు దూరమవుతాడా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.


సల్మాన్ అఘాకు కెప్టెన్సీ బాధ్యతలు

బాబర్ గైర్హాజరీలో సల్మాన్ అలీ అఘాపై భారీ బాధ్యత పడింది. టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా అతడికి ఇదే తొలి మ్యాచ్. అయితే అంతర్జాతీయ స్థాయిలో పాక్ టీ20 జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 32 ఏళ్ల సల్మాన్ 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2013 నుంచే ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్న అతడికి రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా మంచి అనుభవం ఉంది.


ఇటీవలే టాప్-10లోకి బాబర్

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మంచి ప్రదర్శనతో బాబర్ ఆజమ్ ఇటీవలే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి తిరిగి వచ్చాడు. తొలి టెస్టులో 88 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టులో లక్ష్య ఛేదన సమయంలో నాటౌట్‌గా 24 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ దూరం కావడం పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌కు గట్టి దెబ్బే. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతడి అనుభవం పాక్‌కు ఎంతో ఉపయోగపడేదని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు బాబర్ లేకుండా తొలి టెస్టులో పాకిస్థాన్‌ను విజయపథంలో నడిపించే బాధ్యత సల్మాన్ ఆఘాపై పడింది.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

Updated Date - Aug 18 , 2026 | 07:53 PM