బాబర్ ఆజమ్‌కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!
ABN , Publish Date - Sep 02 , 2026 | 09:03 AM
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది. బాబర్‌కు జ్వరం వచ్చినట్లు సమాచారం. దీంతో కీలక మ్యాచ్‌కు ముందు పాక్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే బాబర్ ఆరోగ్యంపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని పాక్ జట్టు మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా తెలిపారు. బాబర్‌కు జ్వరం ఉన్నప్పటికీ.. ఫిట్‌గానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటాడని వెల్లడించారు.
రెండో టెస్టులో ఘోర వైఫల్యం
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బాబర్ ఆజమ్ బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏకంగా 194 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక తొలి టెస్టుకు గాయం కారణంగా బాబర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సల్మాన్ అలీ అఘా పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండో టెస్టులో బాబర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా మూడో టెస్టుకు ముందు మళ్లీ అనారోగ్యం పాలవ్వడం చర్చనీయాంశమైంది.
మిస్బా రాజీనామా అంగీకరించని పీసీబీ!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు జట్టు, కోచింగ్ సిబ్బందిలో పీసీబీ భారీ మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సమాచారం. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని మిస్బా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు వరుస ఓటములు.. మరోవైపు కీలక ఆటగాళ్ల వైఫల్యాలు.. ఇంకోవైపు కోచ్‌లు, ఆటగాళ్లపై వేటు.. ఇప్పుడు కెప్టెన్ బాబర్‌కు జ్వరం. దీంతో ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ జట్టులో సంక్షోభం మరింత ముదిరినట్లైంది.
ఇవి కూడా చదవండి:
వంద కాదు 200 శాతం క్లారిటీ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం!
ఇదేం విచిత్రం.. ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్‌డిన్‌లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!