Damien Martin: కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆసీస్ దిగ్గజం
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:44 PM
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేమియన్ మార్టిన్ ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన ఆశ్చర్యకర రీతిలో సాధారణ స్థితికి వచ్చారు. ఇటీవల ఆయన మెనినైటిస్‌తో బాధపడుతూ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేమియన్ మార్టిన్(Damien Martin) ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. మెనినైటిస్‌తో బాధపడుతున్న 54 ఏళ్ల మార్టిన్ ఇటీవల కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మార్టిన్ ఆరోగ్య విషయంలో వైద్యులు సైతం చేతులు ఎత్తేశారు. దీంతో మార్టిన్ కోమా నుంచి తిరిగి వస్తాడనే ఆశలను కుటుంబ సభ్యులు వదిలేసుకున్నారు. అయితే ఏదో మిరాకిల్ జరిగినట్లు.. తాజాగా మార్టిన్ కోమా నుంచి బయటపడ్డాడు. అదేవిధంగా ఆయన ఆరోగ్య విషయంలో కూడా ఎవరు ఊహించన విధంగా పురోగతి కనిపిస్తోంది. ఆయన ఆరోగ్యం గంట గంటకు ఇంకా మెరుగవుతుందని వైద్యులు తెలిపారు.
యాషెస్ సిరీస్ లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట జరిగింది. ఈ సమయంలోనే ఆస్టేలియా క్రికెట్ బ్రాడ్ కాస్టర్ 'ఫాక్స్ స్పోర్ట్స్' మార్టిన్ ఆరోగ్యం గురించి వెల్లడించిది. మార్టిన్ కోమా నుండి బయటపడ్డాడని, అతను తన బంధుమిత్రులతో మాట్లాడుతున్నాడని తెలిపింది. మార్టిన్ కోమా నుంచి బయటపడటాన్ని ఆసీస్ దిగ్గజ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్(Adam Gilchrist) 'మిరాకిల్'గా అభివర్ణించాడు. 'గత 48 గంటల్లో నమ్మశక్యం కాని విధంగా మార్టిన్ ఆరోగ్యం మెరుగుపడింది. అతను ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాడు. అలానే చికిత్సకు ప్రతిస్పందింస్తున్నాడు. అలానే మార్టిన్ పూర్తిగా కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉంటాడు. కోమా నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అతను అనూహ్యంగా స్పందించాడు. దీన్ని అతని కుటుంబం ఒక రకమైన అద్భుతం లాంటిదిగా భావిస్తోంది' అని గిల్‌క్రిస్ట్ అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా మార్టిన్ ఆరోగ్య పరిస్థితిని గిల్‌క్రిస్ట్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.
ఈ మిరాకిల్ పై మార్టిన్ భార్య అమాండా కూడా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, వారి చేసిన ప్రార్ధనలు, పూజల వల్ల మార్టిన్ కోలుకుంటున్నాడని తెలిపింది. మార్టిన్ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. అభిమానుల సందేశాలు, మీడియా ద్వారా వచ్చిన మద్దతు కారణంగా ఈ అద్భుతం జరిగిందని, కష్ట సమయంలో అండగా ఉన్న వారందకీ పేరుపేరున ఆమె కృతజ్ఞతలు తెలిపింది. డేమియన్ మార్టిన్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. 1992 నుంచి 2006 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నెనేషనల్ క్రికెట్ ఆడాడు. తన కెరీర్(Australia Cricket Legend)లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు. మార్టిన్ ఇటీవల జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు ముందు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384