Share News

చెలరేగిన ఆసీస్‌ పేసర్‌ విల్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:41 PM

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ పేసర్ విల్ బైరోమ్ ధాటికి లంక జట్టు 58 పరుగులకే కుప్పకూలింది.

చెలరేగిన ఆసీస్‌ పేసర్‌ విల్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
Under 19 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: అండర్‌-19 ప్రపంచకప్‌(Under 19 World Cup 2026)లో ఇవాళ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ పేసర్ విల్ బైరోమ్ ధాటికి లంక జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. గ్రూప్-ఏలో భాగంగా నమీబియా క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకపై ఆసీస్ పేసర్‌ విల్‌ బైరోమ్‌(Will Byrom) చెలరేగాడు. అతడి దెబ్బకు లంక బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. విల్ బైరోమ్ ధాటికి 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. విల్ ఐదు వికెట్లు తీసి.. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఛార్లెస్‌ లచ్‌మండ్‌, కేసీ బార్టన్‌ చెరో రెండు వికెట్లు సాధించగా.. హేడెన్‌ ష్కిల్లర్‌ ఒక వికెట్ తీశాడు. లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.


ఓపెనర్‌ దిమంత మహావితన డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ విరాన్‌ చముదిత, దుల్నిత్‌ సిగెరా, ఆడమ్‌ హిల్మి తలా ఒక్క పరుగు మాత్రమే చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి.. 12 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. స్టీవెన్ హోగన్ 28, నితేష్ శామ్యూల్ 19 పరుగులు అజేయంగా నిలిచారు. ఓపెనర్ విల్ మలాజ్చుక్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్‌, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు ఇవాళ శ్రీలంకపై కూడా విజయం సాధించింది. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక(Sri Lanka U19) తమ తొలి రెండు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్‌, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వన్డే కెప్టెన్‌గా తిరిగి రోహిత్‌ శర్మనే.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

Updated Date - Jan 23 , 2026 | 04:50 PM