Share News

ప్రపంచకప్-2026 ఆడకుంటే.. బంగ్లాకు భారీగా ఆర్థిక నష్టం.. ఎంతంటే!

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:40 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరగుతుంది. ఓ స్పోర్ట్ నివేదికల ప్రకారం.. బంగ్లా జట్టు ఐసీసీ టోర్నీలో ఆడకుంటే.. 27 మిలియన్ డాలర్లు లేదా రూ.240 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది.

ప్రపంచకప్-2026 ఆడకుంటే.. బంగ్లాకు భారీగా ఆర్థిక నష్టం.. ఎంతంటే!
Bangladesh T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్‌ కప్‌-2026లో భాగంగా మ్యాచ్‌లు ఆడేందుకు తమ జట్టు ఇండియాకు రాబోదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (బీసీబీ) ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి బంగ్లా ప్రతిపాదన చేసింది. ఈ టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉండటంతో వేదికలు మార్చడం అసాధ్యమంటూ బీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ కూడా తమ నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేసింది. తమ పట్ల ఐసీసీ ఏదైనా అద్భుత నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు బీసీబీ తెలిపింది.


ఇదిలా ఉండగా.. ఒకవేళ ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. బంగ్లా జట్టు టోర్నీలో ఆడకుంటే.. 27 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.240 కోట్లు) వరకు నష్టపోయే అవకాశముంది. బ్రాడ్‌కాస్ట్‌, స్పాన్సర్‌‌షిప్‌ రూపంలో వారికి రావాల్సిన ఏడాది ఆదాయంలో దాదాపు 60 శాతం కోల్పోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రపంచ కప్-2026లో బంగ్లాదేశ్‌ ఆడకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్ కప్‌ ఆడనుంది. త్వరలోనే ఈ విషయంపై ఐసీసీ(ICC) నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.


టీ20 వరల్డ్‌ కప్‌‌లో బంగ్లా జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ ఆడనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై స్పందించేందుకు స్కాట్లాండ్‌ క్రికెట్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌ ఛార్లెస్‌ పీటర్సన్‌ నిరాకరించాడు. ప్రస్తుత పరిస్థితులపై ఏమీ మాట్లాడలేమని, ఏదైనా సమాచారముంటే తామే అధికారికంగా వారి వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీరుపై ఆదేశ క్రికెట్ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 23 , 2026 | 03:26 PM