Share News

ఎలా అయినా జట్టు నుంచి తప్పిస్తారు.. జడ్డూకి అశ్విన్ కీలక సూచన

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:47 PM

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డేల్లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జడేజా గురించి అతడి మాజీ సహచరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ పరంగా జడ్డూకు పలు కీలక సూచనలు చేశాడు.

ఎలా అయినా జట్టు నుంచి తప్పిస్తారు.. జడ్డూకి అశ్విన్ కీలక సూచన
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డేల్లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోనూ జడ్డూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో వన్డే ఫార్మాట్లో అతడి కెరీర్ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జడేజా గురించి అతడి మాజీ సహచరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ పరంగా జడ్డూకు పలు కీలక సూచనలు చేశాడు.


‘జడేజా(Ravindra Jadeja)కు ప్రత్యేకమైన బలాలు ఉన్నాయి. వాటినే అనుసరిస్తూ బౌలింగ్ చేస్తాడు. కానీ ఒక స్నేహితుడిగా నేను జడేజాకు సూచనలు చేస్తూనే ఉంటాను. భిన్నంగా ప్రయత్నిస్తే ఏమవుతుంది? బిషన్ సింగ్ బేడీ, మణిందర్ సింగ్ లేదా మిచెల్ శాంట్నర్‌లా కొత్తగా బౌలింగ్ చేయమని ఇదివరకే చెప్పా. కొత్త విధానంలో విఫలమైతే జట్టు నుంచి బయటకు పంపిస్తారు. కానీ నువ్వు మొండిగా ఉండి పాత పంథాలోనే బౌలింగ్ చేస్తూ విఫలమైనా కూడా టీమ్ నుంచి తప్పిస్తారు. కాబట్టి కొత్తగా ప్రయత్నించి బాగా రాణిస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. అతిగా ఆలోచించి ఏదైనా ప్రతికూలంగా జరుగుతుందని భావించే బదులు సానుకూలంగా ఆలోచించాలి.


జడేజా బౌలింగ్‌ను ఐదేళ్లుగా గమనిస్తున్నా. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడు క్యారమ్ బాల్ ప్రయత్నిస్తాడు. కానీ మ్యాచులో ఆ అస్త్రాన్ని సంధించడు. చాలాకాలంగా తనకు సక్సెస్‌ను తెచ్చిపెట్టిన బలాలనే నమ్ముతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జడేజా తన కెరీర్‌ను కాపాడుకోవాలంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. అతను ఏ మాత్రం కంగారు పడకుండా స్వేచ్ఛగా ఆడుతున్నాడు. అందుకే రాణిస్తున్నాడు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 20 , 2026 | 04:11 PM