Share News

ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:09 PM

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ మధ్యలో జరిగిన ఓ గొడవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌తో గొడవపడ్డాడు.

ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్
Arshdeep Singh

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. ప్రస్తుతం అందరి నోట ‘మెన్ ఇన్ బ్లూ’ ఘనత గురించే! వరుసగా పొట్టి ప్రపంచ కప్‌ను ఎత్తుకున్న జట్టుగా.. ఓవరాల్‌గా ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడిన జట్టుగా.. టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ గొడవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌తో గొడవపడ్డాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

255 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూ వచ్చింది. అయితే 11వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అప్పటికే వైడ్లు వేస్తూ.. వికెట్ కూడా తీయకపోవడంతో అర్ష్‌దీప్‌ కాస్త అగ్రెషన్‌కు గురయ్యాడు.ఈ నేపథ్యంలో అదే ఓవర్ ఐదో బంతికి నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు మిచెల్ ఆడాడు. అయితే ఫాలో త్రులో బంతిని అందుకున్న అర్ష్‌దీప్ కోపంతో వికెట్ల వైపు త్రో విసిరాడు. ఆ బంతి నేరుగా వెళ్లి మిచెల్‌కు బలంగా తాకింది. క్రీజులో ఉన్నప్పటికీ తనపైకి బంతి విసరడంతో మిచెల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అర్ష్‌దీప్ వైపు కోపంగా చూస్తూ..గట్టిగా అరుస్తూ అతడి వైపు వెళ్లాడు. అయినా అర్ష్‌దీప్ తొలుత క్షమాపణ చెప్పకుండా వెనక్కి నడవడంతో మిచెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.


వెంటనే సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్‌కు సర్దిచెప్పాడు.అంపైర్ కూడా అర్ష్‌దీప్‌ను పిలిచి హెచ్చరించాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ స్వయంగా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. అయితే అర్ష్‌దీప్ సింగ్ ప్రవర్తనపై నెట్టింట్ విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన 4 ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.


ఇవి కూడా చదవండి:

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంట్నర్

Updated Date - Mar 09 , 2026 | 03:47 PM