Share News

ఫిఫా ట్రోఫీ వేడుక: వివాదాస్పదంగా అర్జెంటీనా ప్లేయర్ల తీరు!

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:59 PM

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఓటమి అనంతరం అర్జెంటీనా ఆటగాళ్ల ప్రవర్తన తీవ్ర చర్చకు దారితీసింది. ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ ట్రోఫీ అందుకుంటున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు వెనక్కి తిరిగి నిలబడటంపై ఫుట్‌బాల్ వర్గాలు మండిపడుతున్నాయి.

ఫిఫా ట్రోఫీ వేడుక: వివాదాస్పదంగా అర్జెంటీనా ప్లేయర్ల తీరు!
Argentina FIFA World Cup 202

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఓటమి అనంతరం అర్జెంటీనా ఆటగాళ్ల ప్రవర్తన తీవ్ర చర్చకు దారితీసింది. ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ ట్రోఫీ అందుకుంటున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు వెనక్కి తిరిగి నిలబడటంపై ఫుట్‌బాల్ వర్గాలు మండిపడుతున్నాయి. రన్నరప్ జట్టుకు ఉండాల్సిన క్రీడాస్ఫూర్తి కనిపించలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పెయిన్ కనబరిచిన ప్రదర్శనకు చప్పట్లతో శుభాకాంక్షలు కూడా చెప్పకుండా.. మెస్సి సేన ఏమీ పట్టనట్టు ఉండటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.


సిల్వర్ మెడల్స్ అందుకున్న తర్వాత అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలోనే ఉండి కొత్త ఛాంపియన్లకు చప్పట్లతో అభినందనలు తెలపలేదు. అర్జెంటీనా రన్నర్ పతకాలు అందుకుంటున్న సమయంలో స్పెయిన్ ఆటగాళ్లు గౌరవం చూపించినప్పటికీ.. మెస్సితో పాటు అతని సహచరులు పక్కకు వెళ్లిపోయారు. స్పెయిన్ ట్రోఫీ అందుకునే సమయంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఇక టోర్నీలో అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ రోడ్రి అందుకుంటున్న సమయంలో అర్జెంటీనా అభిమానులు స్టేడియంలో మెస్సి పేరును నినదించడం కూడా మరో చర్చకు కారణమైంది.


క్రీడాస్ఫూర్తే లేదు..

అర్జెంటీనా తీరుపై ప్రముఖ వ్యాఖ్యాత అడ్రియన్ డర్హమ్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ఇందులో ఏమాత్రం క్లాస్ కనిపించలేదు. అర్జెంటీనా తీరు పూర్తిగా నిరాశపరిచింది. రోడ్రి ఉత్తమ ఆటగాడి అవార్డు అందుకుంటున్న సమయంలో కూడా మెస్సి పేరుతో నినాదాలు చేయడం, ఓటమిని అంగీకరించలేకపోతున్నారనే భావన కలిగించింది. టోర్నీలో అర్జెంటీనాకే అనేక నిర్ణయాలు అనుకూలంగా వచ్చాయి. కానీ స్పెయిన్ వాటన్నింటినీ తిప్పి కొట్టింది’ అని వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 20 , 2026 | 04:59 PM