Share News

పదవీకాలాన్ని పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:00 PM

భారత జట్టు వరుస విజయాల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవీకాలాన్ని వన్డే ప్రపంచ కప్ 2027 వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం.

పదవీకాలాన్ని పొడిగించమని బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!
Ajit Agarkar

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఇటీవలే టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. భారత జట్టు వరుస విజయాల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవీకాలాన్ని వన్డే ప్రపంచ కప్ 2027 వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. పొట్టి ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజులకే ఈ అభ్యర్థన రావడం గమనార్హం. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయాల నేపథ్యంలో అగార్కర్ కాంట్రాక్ట్‌ను బోర్డు ఒక సంవత్సరం పొడిగించిన విషయం తెలిసిందే.


అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. అగార్కర్ పదవీకాలంలో టీమిండియా 4 ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం.


విమర్శలే ఎక్కువ..

జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది.


మొత్తానికి భారత జట్టు విజయాలకు క్రీడాకారులతో పాటు సెలక్టర్ల పాత్ర కూడా ఎంత ముఖ్యమో అగార్కర్ ప్యానెల్ స్పష్టంగా చూపించింది. ఇప్పుడు అతని పదవీకాల పొడిగింపుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

‘ఐపీఎల్’పై పిటిషన్ దాఖలు.. కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు

విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్

Updated Date - Mar 19 , 2026 | 12:25 PM