Share News

ఐసీయూలో అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్.. పరిస్థితి అత్యంత విషమం!

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:02 PM

అఫ్గానిస్థాన్ మాజీ క్రికెటర్ షాపుర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య దారుణంగా పడిపోవడంతో అతడు కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.

ఐసీయూలో అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్.. పరిస్థితి అత్యంత విషమం!
Shapoor Zadran

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ మాజీ క్రికెటర్ షాపుర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య దారుణంగా పడిపోవడంతో అతడు కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. మరో 18 గంటలు గడిస్తే కానీ షాపుర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.


జద్రాన్ ఆరోగ్యంపై క్రికెట్ ప్రపంచం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్.. జద్రాన్ ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘జద్రాన్ నాకు అన్నలాంటివాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా జద్రాన్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ‘జద్రాన్ సోదరుడితో మాట్లాడాను. అతని పరిస్థితి వినగానే చాలా బాధేసింది. మైదానంలో జట్టు గెలుపు కోసం పోరాడినట్లే తన చావుతో కూడా పోరాడి గెలవాలి. జద్రాన్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను’ అని తెలిపాడు.


జద్రాన్ 2009లో క్రికెట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడాడు. అఫ్గానిస్థాన్ తరఫున అతడు 80 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 44 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు, టీ20ల్లో 36 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు సాధించాడు. ఎడమచేతి పేస్ బౌలర్‌గా తనదైన ముద్ర వేసిన జద్రాన్.. అఫ్గానిస్థాన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న ఈ మాజీ స్టార్ బౌలర్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ప్రపంచం అంతా ప్రార్థిస్తోంది.


ఇవి కూడా చదవండి:

అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్

ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!

Updated Date - Apr 18 , 2026 | 07:09 PM