Share News

అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు.. టీమిండియాలో స్థానం శాశ్వతమేనా?

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:29 PM

విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీ20 జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.

అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు.. టీమిండియాలో స్థానం శాశ్వతమేనా?
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఓపెనర్ అభిషేక్ మాత్రం విఫలమయ్యాడు. దీంతో టీ20 జట్టులో అతడి స్థానంపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్.. జింబాబ్వేపైనా అదే పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేసి సగటు 3.66తో సిరీస్‌ను ముగించాడు. ఇది ఒక్క సిరీస్ వైఫల్యం మాత్రమే కాదు.. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న పేలవ ప్రదర్శనకు కొనసాగింపుగా మారింది.


ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్-1గా నిలిచిన అభిషేక్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మైదానంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనిపించడం లేదు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల్లో 131 పరుగులు (సగటు 26.2), ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల్లో 49 పరుగులు (సగటు 24.5) మాత్రమే చేశాడు. చివరి 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క అర్ధ శతకం నమోదు చేయడం గమనార్హం.


సెలెక్టర్ల తీరుపై ప్రశ్నలు

జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్‌ను ఔట్ చేయడం విశేషం. ఇటీవల భారత సెలెక్షన్ కమిటీ స్టార్ ప్లేయర్లను కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పక్కన పెడుతోంది. అందుకు సంజు శాంసన్ ఉదాహరణ. టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఐదు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజు.. నాకౌట్ దశలో 97 నాటౌట్, 89, 89 పరుగులతో భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ జింబాబ్వే పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. అయితే అభిషేక్ శర్మకు మాత్రం వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా సెలెక్టర్లు పూర్తి మద్దతు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.


ప్రతిభకు మద్దతు అవసరమే.. కానీ!

ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం తప్పు కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టును తీర్చిదిద్దడం ప్రతి జట్టు చేసే పని. కానీ అదే ప్రమాణాలు అందరికీ వర్తించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత క్రికెట్‌లో స్థానం ప్రదర్శన ఆధారంగానే దక్కుతుందని తరచూ చెబుతుంటారు. ప్రతి ఇన్నింగ్స్‌కు విలువ ఉంటుందని అంటుంటారు. అలాంటప్పుడు దీర్ఘకాలంగా విఫలమవుతున్న ఆటగాడి విషయంలో కూడా అదే ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

సాటి మనిషికి సాయం చేయాలనే తపన ఉండాలి: వరుణ్ ఆరోన్

Updated Date - Jul 27 , 2026 | 10:07 PM