Share News

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

ABN , Publish Date - Jul 27 , 2026 | 07:34 PM

కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. మహిళల 53 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో జ్ఞానేశ్వరీ యాదవ్ రజత పతకం సాధించింది.

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
Gyaneshwari Yadav

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. మహిళల 53 కేజీల వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలో జ్ఞానేశ్వరీ యాదవ్ రజత పతకం సాధించింది. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలు ఎత్తిన జ్ఞానేశ్వరీ మొత్తంగా 199 కేజీల బరువును లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో నైజీరియాకు చెందిన ఒనోమే ఒమోలోలా దిదిహ్(206 కేజీలు) స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఇప్పటివరకు భారత్ ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకుంది.


ఉత్కంఠభరితంగా సాగిన పోరు

జ్ఞానేశ్వరి, దిదిహ్ మధ్య జరిగిన పోటీ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ప్రతి విజయవంతమైన లిఫ్ట్‌తో రికార్డులు మారిపోతుండటంతో ప్రేక్షకులు ఉత్కంఠగా వీక్షించారు. స్నాచ్ విభాగంలో జ్ఞానేశ్వరి మూడు ప్రయత్నాల్లోనూ విజయవంతమై అద్భుత స్థిరత్వాన్ని ప్రదర్శించింది. ప్రతి లిఫ్ట్‌ను సునాయాసంగా పూర్తి చేస్తూ నైజీరియా లిఫ్టర్‌కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే అసలు పోరు క్లీన్ అండ్ జెర్క్‌లో కనిపించింది. మొదట జ్ఞానేశ్వరి 107 కిలోలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన దిదిహ్ 110 కిలోలు ఎత్తి ఆ రికార్డును చెరిపేసింది. దాంతో వెనుకడుగు వేయని జ్ఞానేశ్వరి భారత అభిమానుల హర్షధ్వానాల మధ్య 111 కిలోలు విజయవంతంగా ఎత్తి మరోసారి గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. అయితే ఆ ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. దిదిహ్ 113 కిలోలు ఎత్తి మరోసారి రికార్డును తిరగరాస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: భారత షూటర్ల హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం

Updated Date - Jul 27 , 2026 | 07:54 PM