Share News

సాటి మనిషికి సాయం చేయాలనే తపన ఉండాలి: వరుణ్ ఆరోన్

ABN , Publish Date - Jul 27 , 2026 | 07:13 PM

భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ ఆటగాడిగా క్రికెట్‌కు దూరమైనా.. బౌలింగ్‌పై అతడికున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.

సాటి మనిషికి సాయం చేయాలనే తపన ఉండాలి: వరుణ్ ఆరోన్
Varun Aaron

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ ఆటగాడిగా క్రికెట్‌కు దూరమైనా.. బౌలింగ్‌పై అతడికున్న ప్రేమ మాత్రం తగ్గలేదు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. దీనికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఆటగాడి నుంచి కోచ్‌గా మారిన తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అయితే వరుణ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.


‘కోచ్‌గా ఉండటంలో ప్రధానమైన అంశం మరో మనిషికి సాయం చేయాలనే తపన. అది ఉంటే మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం తర్వాతి విషయాలు. ఎంత గొప్ప టాక్టికల్ కోచ్ అయినా.. ఎదుటి వ్యక్తికి సాయం చేయాలనే ఉద్దేశం లేకపోతే ఉపయోగం ఉండదు. ఆటగాడిగా ఉన్నప్పుడు నేను మ్యాచ్‌లు ఎక్కువగా చూసేవాడిని కాదు. రిటైర్‌మెంట్ తర్వాత కామెంటరీ, విశ్లేషణ వైపు రావడం కొత్త అనుభూతిని ఇచ్చింది. రెండేళ్లుగా నేను దాదాపు 80 మ్యాచ్‌లు చూశాను. అంతకుముందు నా జీవితమంతా కలిపినా 20 మ్యాచ్‌లు కూడా చూసి ఉండను. ఆటను మరో కోణంలో చూడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది’ అని వరుణ్ వివరించాడు.


ఆయనే నా కెరీర్‌ను తీర్చిదిద్దారు..

తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ డెన్నిస్ లిల్లీ పాత్ర ఎంతో ఉందని వరుణ్ చెప్పాడు. ‘14 ఏళ్ల వయసులోనే డెన్నిస్ లిల్లీని కలిశాను. ఆయన నాకు పని పట్ల నిబద్ధత నేర్పించారు. ఫాస్ట్ బౌలర్ అయితే బౌలింగ్ గురించే ఆలోచించాలి.. దానినే తినాలి, నిద్రపోవాలి, శ్వాసించాలి అని చెప్పేవారు. మైదానంలోకి దిగినప్పుడు పోరాడాలని నేర్పించారు. ఏ ప్లేయర్ మైదానంలో విఫలం కావాలని కోరుకోడు. ఒక ఆటగాడు ప్రణాళికను అమలు చేయలేకపోవడానికి మానసికంగా, సాంకేతికంగా లేదా వ్యూహాత్మకంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గుర్తించి పరిష్కరించడం కోచ్ బాధ్యత. కోచ్‌కు ముఖ్యంగా కావాల్సింది సానుభూతి, ఆసక్తి, ఓర్పు. ఆటగాడు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకుని అతడికి సరైన మార్గం చూపించగలగాలి’ అని వరుణ్ ఆరోన్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం.. ముత్తుపాండికి నజరానా ప్రకటించిన సీఎం విజయ్

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: భారత షూటర్ల హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం

Updated Date - Jul 27 , 2026 | 07:14 PM